
Luxembourg: ఒకప్పుడు మహిళలు అంటే.. ఇంటికే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు మహిళా సాధికారిత పేరుతో అన్ని దేశాలు వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. చాలా కంపెనీల్లో మహిళలు లీడిండ్ పొజిషన్‌లో ఉంటున్నారు. పురుషులతో సమానంగా మహిళలు ఉద్యోగాల్లో వృద్ది సాధిస్తున్నారు. కానీ పురుషులతో పోలిస్తే మహిళలకు జీతం తక్కువగా లభిస్తుంది. అభివృద్ది చెందుతున్న దేశాలతో పాటు అభివృద్ది చెందిన దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి.
అంతర్జాతీయ కార్మిక సంస్థ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పురుషుల కంటే మహిళలు 20 శాతం తక్కువ సంపాదిస్తున్నట్లు వెల్లడైంది. అన్ని దేశాల్లో పురుష, మహిళల మధ్య జీతం విషయంలో వ్యత్యాసం కనిపిస్తుండగా.. ఆ దేశంలో మాత్రం పురుషుల కంటే మహిళలు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇంతకు ఆ దేశం ఏంటి..? అక్కడ మహిళలు ఎందుకు ముందున్నారు.? అనే విషయాలు తెలుసుకుందాం.
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి టాప్ మోస్ట్ దేశాల్లో మహిళల కంటే పురుషులు ఎక్కువగా సంపాదిస్తున్నారు. కానీ యూరోపియన్ దేశమైన లక్సెంబర్గ్‌లో మాత్రం సీన్ రివర్స్. ఆ దేశంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ సంపాదిస్తున్నారు. యూరోస్టాట్ అనే సంస్థ ఇటీవల పురుషులు, మహిళ మధ్య వేతన వ్యత్యాసంపై విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దేశంలో లింగ వేతన వ్యత్యాసం -0.7 శాతంగా ఉంది.
లక్సెంబర్గ్ దేశంలో ప్రభుత్వ రంగంలో మహిళలు ఎక్కువగా పనిచేస్తున్నారు. దీంతో వారికి పెద్ద మొత్తంలో జీతాలు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కువ ధనిక దేశంగా కూడా ఇది ఉంది. దేశ జీడీపీ కూడా అధికంగా ఉంది. ఇక్కడ లింగ సమానత్వం, బలమైన స్నేహాపూర్వక విధానాలు అమల్లో ఉన్నాయి. దీంతో పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు, వేతనాలు కల్పిస్తున్నారు. దీని వల్ల ఆ దేశంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువగా సంపాదిస్తు్న్నారు.