EPF Balance Check: పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ పెరుగుతుందా..? ఖాతాలను చెక్ చేసుకోండిలా…!

ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించే రిటైర్మెంట్ పథకాలలో ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ముందు వరుసలో ఉంటుంది. దేశ వ్యాప్తంగా అనేక మంది దీనిలో చందాదారులుగా ఉన్నారు. ప్రతి నెలా వారి జీతం నుంచి కొంత మొత్తం దీనిలో జమ అవుతుంది. ఆ ఉద్యోగులు పనిచేసే సంస్థ యజమాని కూడా తన వంతుగా అంతే మొత్తాన్ని అందిస్తాడు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి పెద్ద మొత్తంలో సొమ్ము అందుతుంది. ఈ పథకాన్ని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ వో) పర్యవేక్షిస్తుంది. అయితే ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటు 8 నుంచి 8.25 శాతానికి సవరించే అవకాశం ఉందని సమాచారం.

EPF Balance Check: పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ పెరుగుతుందా..? ఖాతాలను చెక్ చేసుకోండిలా...!
Epf Balance

Updated on: Feb 16, 2025 | 7:15 PM

సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశం ఫిబ్రవరి 28న జరగనుంది. దీనిలో ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీని 8 నుంచి 8.25 శాతానికి సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. ఈ వడ్డీరేటును మొదటి ఈపీఎఫ్ వో సూచిస్తుంది. దానికి సీబీటీ ఆమోద ముద్ర వేస్తుంది. అనంతరం ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందిన తర్వాత చందాదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ఈపీఎఫ్ వో కు దేశ వ్యాప్తంగా దాదాపు 65 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు. వీరి జీతం నుంచి ప్రతి నెలా చందా కట్ అవుతుంది. అయితే చాలామందికి తమ ఖాతాలో సొమ్ము ఎంత ఉందో తెలియదు. అయితే ప్రస్తుతం చాలా సులభంగా ఆ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి ఉద్యోగికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) అనే 12 అంకెల ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు. దాని ద్వారా చాాలా సులభంగా పీఎఫ్ బ్యాలెన్స్ ను తెలుసుకోవచ్చు. దాని కోసం ఈ కింద తెలిపిన పద్దతులు పాటించాలి.

ఉమాంగ్ యాప్

ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్ లోని ఉమాంగ్ యాప్ ను ఉపయోగించి పీఎఫ్ బ్యాలెన్స్ ను తనిఖీ చేసుకోవచ్చు. పౌరులందరూ వివిధ ప్రభుత్వం సేవలను ఒకేచోట పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఈ యాప్ ను విడుదల చేసింది. దీని కోసం మీ ఫోన్ నంబర్ ను నమోదు చేసి, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి.

ఈపీఎఫ్ వో పోర్టల్

ఈపీఎఫ్ వో వెబ్ సైట్ లోని ఉద్యోగుల విభాగానికి వెళ్లి, సభ్యుల పాస్ బుక్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. యూఏఎన్, పాస్ వర్డ్ నమోదు చేసి పీఎఫ్ బుక్ ను పరిశీలించవచ్చు. ప్రారంభ, ముగింపు బ్యాలెన్స్ తో పాటు ఉద్యోగి, యజమాని షేర్ ను చూపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిస్ట్ కాల్

యూఏఎన్ నంబర్ ఉన్న చందాదారులు మిస్ట్ కాల్ ను ఉపయోగించి పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 011-22901406కు మిస్ట్ కాల్ ఇవ్వండి. వెంటనే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో మీకు ఫోన్ కు మెసేజ్ వస్తుంది.

ఎస్ఎంఎస్

ఎస్ఎంఎస్ పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ను పరిశీలించుకోవచ్చు. యూఏఎన్ లో రిజిస్టర్ అయిన చందాదారులు 77382 99899కు ఎస్ఎంఎస్ పంపాలి. ఇంగ్లిషులో సమాచారం కోసం EPFOHO UAN ENG అని టైప్ చేసి పైన తెలిపిన నంబర్ కు ఎస్ఎమ్ఎస్ పంపాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి