ఎయిర్ ఇండియాకు చెందిన ఎయిర్ బస్ ఏ350, బోయింగ్ 787-9తో పాటు ఎంపిక చేసిన ఏ321 విమానాల్లో వైఫై సేవలు లభిస్తాయి. దేశీయంగా ఇలాంటి సేవలందిస్తున్న తొలి విమానాయాన సంస్థగా ఎయిర్ ఇండియా రికార్డు నెలకొల్పింది. విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత సుమారు పదివేల అడుగులు ఎత్తు దాటాక వైఫై ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణికులు తమ ల్యాప్ టాప్ లు, టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లకు వైఫైను కనెక్ట్ చేసుకోవచ్చు. వాటి ద్వాారా ప్రయాణంలోనే తమ పనులను నిర్వహించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ప్రయాణికులందరికీ ఎయిర్ ఇండియా ఉచితంగా అందజేస్తోంది.
ఎయిర్ ఇండియాకు చెందిన అంతర్జాతీయ రూట్లలో గతంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలను మొదలు పెట్టారు. న్యూయార్క్, లండన్, పారిస్, సింగపూర్ తదితర మార్గాల్లో నడిచే ఎయర్ బస్ ఏ350, ఎయిర్ బస్ ఏ321 నియో, బోయింగ్ బీ787-9 విమానాల్లో అందజేస్తున్నారు. వాటికి కొనసాగింపుగా దేశీయ విమానాలకు ఈ సేవలను తీసుకువచ్చారు. టాాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా సంస్థ తీసుకువచ్చిన ఈ సేవలు ప్రయాణికులకు చాలా ఉపయోగంగా ఉంటున్నాయి. ఈ గ్రూపులో దాదాపు 300 విమానాలు ఉన్నాయి. దీనిలో ఎయిర్ ఇండియాతో పాటు తక్కువ చార్జీలతో నడిచే దాని అనుబంధ ఎయిర్ లైన్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉన్నాయి. గత అక్టోబర్ లో ఏఐఎక్స్ కనెక్ట్, ఆ తర్వాత విస్తారా సంస్థలు ఎయిర్ ఇండియాలో విలీనమయ్యాయి.
కొన్ని రకాల ఆర్టీస బస్సులు, మెట్రో రైళ్లు తదితర వాటిలో ఉచిత వైఫై సర్వీసులను ప్రయాణికులకు అందించడం ఇప్పటి వరకూ తెలిసిందే. ప్రయాణ సమయంలో వాటిని ప్రజలు వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు గాలిలో ప్రయాణించే సమయంలోనూ ఈ సేవలను అందుబాటులోకి రావడం గమనార్హం. అంతర్జాతీయ రూట్లలో అందిస్తున్న ఈ సేవలను దేశీయంగాను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తీసుకువచ్చింది. విమాన ప్రయాణికులకు వైఫై సేవలను రెండు రకాలుగా అందిస్తారు. ఒకటి ఎయిర్ టు గ్రౌండ్, రెండోది శాటిలైట్ వైఫై. మొదటి పద్ధతి నేలపై ఉండే ఇంటర్నెట్ లాంటింది. సెల్ టవర్ల్ ద్వారా ఆకాశంలోకి సిగ్నల్స్ పంపుతారు. రెండో విధానంలో విమానాలకు యాంటీనా అమర్చుతారు. శాటిలైట్ నుంచి సిగ్నల్స్ అందుతాయి. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. చాలా విమానాయన సంస్థలు దీన్ని అమలు చేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి