AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే రేసులోకి మేడ్ ఇన్ ఇండియా రైళ్లు..

భారత్-జపాన్ దేశాల ప్రతిష్టాత్మక బులెట్ ట్రైన్ ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. పనులు జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుండటంతో.. జపాన్ రైళ్ల కోసం ఎదురుచూడకుండా, అనుకున్న సమయానికే మన సొంత రైళ్లతో ఆపరేషన్స్ మొదలుపెట్టాలని ఇరుదేశాలు ఒక కీలక ఒప్పందానికి వచ్చాయి. 2027లో పట్టాలెక్కబోయే మన స్వదేశీ రైలు స్పెషాలిటీ ఏంటి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో బిగ్ ట్విస్ట్.. జపాన్ కంటే ముందే రేసులోకి మేడ్ ఇన్ ఇండియా రైళ్లు..
India Japan Bullet Train Update
Krishna S
|

Updated on: Jul 17, 2026 | 2:48 PM

Share

భారతదేశ కలల ప్రాజెక్ట్ అయిన ముంబై – అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులో చారిత్రాత్మక మలుపు చోటుచేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో భారత్, జపాన్ దేశాలు ఒక సంచలన నిర్ణయానికి వచ్చాయి. ప్రాజెక్టు మొదటి విడత ప్రారంభ కార్యకలాపాలను పూర్తిగా భారతదేశంలోనే తయారయ్యే హైస్పీడ్ రైలుతో ప్రారంభించనున్నారు. జపాన్ ఈ ప్రాజెక్ట్ కోసం అత్యంత అధునాతనమైన E10 సిరీస్ షింకాన్సెన్ బులెట్ రైళ్లను అందించడానికి అంగీకరించింది. అయితే ఈ నెక్స్ట్ జనరేషన్ రైళ్లు ప్రస్తుతం జపాన్‌లో ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్నాయి. ఇవి 2030లో అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి.

ఊహించిన దానికంటే వేగంగా..

మరోవైపు మనదేశంలో బులెట్ ట్రైన్ నిర్మాణ పనులు ఊహించిన దానికంటే అత్యంత వేగంగా దూసుకుపోతున్నాయి. ఇప్పటికే దాదాపు 80శాతం పైగా పనులు పూర్తయ్యాయి. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించినట్లుగా.. 2027 ఆగస్టు 15 నాటికి గుజరాత్‌లోని సూరత్ – బిలిమోరా మధ్య మొదటి సెక్షన్‌ను ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతుంది. జపాన్ రైళ్ల కోసం 2030 వరకు ఆగితే ప్రాజెక్ట్ ఆలస్యమవుతుంది కాబట్టి లభించిన సమాచారం ప్రకారం.. ఈ లోపు స్వదేశీ హైస్పీడ్ రైళ్లతోనే ఆపరేషన్స్ మొదలుపెట్టాలని ఇరుదేశాలు పరస్పర అంగీకారానికి వచ్చాయి.

ఐసీఎఫ్ ఆధ్వర్యంలో స్వదేశీ బులెట్ తయారీ

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగళూరుకు చెందిన BEML సంస్థతో కలిసి గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సరికొత్త స్వదేశీ హైస్పీడ్ రైలును అభివృద్ధి చేస్తోంది. 2027లో ప్రారంభం కాబోయే మొదటి విడత ట్రాక్‌పై ఈ ఇండియన్ హైస్పీడ్ రైళ్లే పరుగులు తీయనున్నాయి.

2030లో జపాన్ ఈ10 ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్..

భారతదేశంలో మొదట ఈ స్వదేశీ రైళ్లు నడుస్తున్నప్పటికీ, ట్రాక్ సిద్ధమయ్యాక జపాన్‌కు చెందిన ప్రస్తుత E5 సిరీస్ రైళ్లతో కూడా కొన్ని ట్రయల్స్ జరగనున్నాయి. ఆ తర్వాత 2030లో జపాన్, భారత్‌లలో ఒకేసారి సరికొత్త E10 సిరీస్ రైళ్లు రంగ ప్రవేశం చేస్తాయి. ఈ E10 సిరీస్ రైళ్లు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతాయి. ఇందులో భూకంపాలను తట్టుకునే అధునాతన సేఫ్టీ సిస్టమ్స్, నిశబ్దమైన క్యాబిన్లు, బిజినెస్ ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రెయిన్ డెస్క్ సదుపాయాలు ఉండబోతున్నాయి. ఈ నిర్ణయంతో భారతదేశానికి సొంతంగా హైస్పీడ్ రైళ్లను తయారు చేసుకునే సాంకేతికత దక్కడమే కాకుండా అనుకున్న సమయానికి బులెట్ ట్రైన్ కల సాకారం కానుంది. భారత్-జపాన్ దేశాల మధ్య ఉన్న దృఢమైన వ్యూహాత్మక బంధానికి, పరస్పర సహకారానికి ఈ ప్రాజెక్ట్ ఒక అద్భుత నిదర్శనంగా నిలుస్తోంది.

Follow Us