AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది? తోబుట్టువులకేనా..?

పిల్లలు లేని దంపతులు వీలునామా రాయకుండా మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుందనే విషయం భారత వారసత్వ చట్టాలపై ఆధారపడి ఉంటుంది. హిందువులకు హిందూ వారసత్వ చట్టం, ముస్లింలకు షరియా చట్టం, క్రైస్తవులకు ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తాయి. భార్య, భర్త, తల్లిదండ్రులు, సోదరులు వంటి బంధువులకు చట్టబద్ధంగా ఆస్తి పంపిణీ అవుతుంది.

పిల్లలు లేని దంపతులు మరణిస్తే వారి ఆస్తి ఎవరికి దక్కుతుంది? తోబుట్టువులకేనా..?
Indian Succession Laws
SN Pasha
|

Updated on: Aug 24, 2026 | 12:00 PM

Share

తల్లిదండ్రుల ఆస్తికి పిలల్లే వారసులు అంటారు. అయితే మరీ పిల్లలు లేని వారి ఆస్తులు ఎవరికి చెందుతాయి? సొంత ఇల్లు, భూమి, బ్యాంకు డిపాజిట్లు, బంగారం.. ఇలా జీవితాంతం సంపాదించిన ఆస్తులకు వారసులు ఎవరు? ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తి ఎవరికి చెందుతుంది? ఈ విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. దీనికి సమాధానం ఒకేలా ఉండదు. మరణించిన వ్యక్తి ఏ మతానికి చెందినవారు, ఆస్తి స్వరూపం, భర్త లేదా భార్య ఎవరు ముందుగా మరణించారు వంటి అంశాలపై వారసత్వ హక్కులు మారుతాయి.

హిందువులకు హిందూ వారసత్వ చట్టం

హిందూ దంపతుల విషయంలో ప్రధానంగా హిందూ వారసత్వ చట్టం 1956 వర్తిస్తుంది. పిల్లలు లేకుండా ఒక హిందూ పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే, మొదట క్లాస్ వన్ వారసులను పరిశీలిస్తారు. పిల్లలు లేకపోయినా భార్య, తల్లి వంటి క్లాస్ వన్ వారసులు ఉంటే వారికి హక్కు ఉంటుంది. క్లాస్ వన్ వారసులు ఎవరూ లేకపోతే క్లాస్ టూ వారసుల క్రమం ప్రారంభమవుతుంది.

భర్త ముందుగా మరణిస్తే?

పిల్లలు లేని హిందూ దంపతుల్లో భర్త ముందుగా మరణించాడని అనుకుందాం. అతని ఆస్తిలో భార్యకు వారసత్వ హక్కు ఉంటుంది. అదే సమయంలో తల్లి జీవించి ఉంటే ఆమెకూ క్లాస్ వన్ వారసురాలిగా హక్కు ఉంటుంది. భార్య లేదా ఇతర క్లాస్ వన్ వారసులు లేకపోతే తండ్రి, ఆ తర్వాత సోదరులు, సోదరీమణులు తదితర క్లాస్ టూ వారసుల క్రమం వస్తుంది.

భార్య ముందుగా మరణిస్తే పరిస్థితి ఏంటి?

హిందూ మహిళ వీలునామా లేకుండా మరణించినప్పుడు సెక్షన్ 15 ప్రత్యేకంగా వర్తిస్తుంది. పిల్లలు లేని సందర్భంలో మొదట భర్త వారసుడిగా ఉంటాడు. ఆ తర్వాత భర్తకు సంబంధించిన వారసులు, తరువాత ఆమె తల్లిదండ్రులు, ఆ తర్వాత తండ్రి వారసులు, చివరగా తల్లి వారసుల క్రమం ఉంటుంది. అయితే ఆమె తల్లిదండ్రుల నుంచి లేదా భర్త నుంచి వారసత్వంగా పొందిన ఆస్తికి ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి.

ఇద్దరూ మరణిస్తే?

భర్త, భార్య ఇద్దరూ మరణించిన సందర్భంలో ఎవరు ముందుగా మరణించారు అనే విషయం కీలకంగా మారుతుంది. ఒకరు ముందుగా మరణిస్తే వారి ఆస్తి ముందుగా ఆ సమయంలో జీవించి ఉన్న చట్టబద్ధ వారసులకు వెళ్తుంది. ఆ తర్వాత రెండో వ్యక్తి మరణించినప్పుడు, అతని లేదా ఆమెకు వచ్చిన ఆస్తి మళ్లీ వారి వారసత్వ నియమాల ప్రకారం పంపిణీ అవుతుంది.

ఇతర మతాల వారికి వేరే రూల్స్?

వారసత్వ చట్టాలు మతాన్ని బట్టి మారవచ్చు. ఉదాహరణకు ముస్లింలకు వీలునామా లేకుండా వారసత్వం విషయంలో ముస్లిం పర్సనల్ లా(షరియత్) వర్తిస్తుంది. క్రైస్తవులు, పార్సీలకు భారతీయ వారసత్వ చట్టం 1925లోని సంబంధిత నిబంధనలు వర్తిస్తాయి. అందువల్ల పిల్లలు లేని దంపతులు తమ ఆస్తి భవిష్యత్తులో ఎవరికి వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొంటూ చట్టబద్ధమైన వీలునామా తయారు చేసుకోవడం వివాదాలను తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us