
ప్రపంచ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీదారు వోల్వో ఓ షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక డీజిల్ ఇంజిన్ కార్ల తయారీకి స్వస్తి పలకనున్నట్లు చెప్పింది. 2024 ప్రారంభానికి మొత్తం డీజిల్ కార్ల తయారీని పూర్తిగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లను పూర్తి స్థాయిలో తయారు చేయనున్నట్లు పేర్కొంది. తద్వారా ప్రపంచంలో మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుగా అవతరించనున్నట్లు వెల్లడించింది. రానున్న కొన్ని నెలల్లోనే తమ చివరి డీజిల్ ఇంజిన్ వోల్వో కారును ఆవిష్కరించనున్నట్లు వివరించింది. తద్వారా పూర్తి ఎలక్ట్రిక్ కార్లను తయారీపై దృష్టి పె ట్టనున్నట్లు చెప్పింది. ఈ విధంగా తాము తీసుకున్న నిర్ణయం లెగసీ కార్ల తయారీదారుల్లో వోల్వోనే మొదటిగా నిలించింది ఆకంపెనీ ప్రకటించుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహం లభిస్తోంది. వాతావరణానికి హాని చేయని విధంగా.. కర్బన ఉద్ఘారాలను తగ్గించేందుకని అన్ని దేశాలు కలిసి విద్యుత్ వాహనాల ఉత్పత్తికి ప్రోత్సాహాలు అందిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న స్టార్టప్ కంపెనీల నుంచి పెద్ద పెద్ద దిగ్గజ వాహనతయారీ దారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టి సారించాయి. దీంతో కార్లు, బైక్ లు, స్కూటర్లు, బస్సులు పెద్ద సంఖ్యలోనే లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో చాలా కంపెనీలు తమ పెట్రోల్, డీజిల్ వాహనాలకు పూర్తిగా నిలిపివేసి, మొత్తంగా ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాయి.
వాటిల్లో ముందుగా చెప్పుకోవాల్సింది వోల్వో గురించి. ఈ లగ్జరీ కార్ల తయారీదారు 2024 ప్రారంభానికే మొత్తం డీజిల్ కార్ల తయారీకి ఫుల్ స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇకపై పూర్తిగా ఎలక్ట్రిక్ వేరియంట్ కార్లనే తయారు చేయాలని భావిస్తున్నారు. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిఫై అయ్యే విధంగా చర్యలు తీసుకుంటుంది. కాగా యూరోప్ దేశాలలో ఎక్కువగా అమ్మడయ్యే ఈ వోల్వో కారు 2019 సమయానికి అధికంగా డీజిల్ కార్లనే విక్రయించింది. అదే 2022 నాటికి 8.9శాతం వృద్ధి రేటు సాధించి మరిన్ని డీజిల్ కార్లను విక్రయించినట్లు పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆగస్టు నాటికి మాత్రం వోల్వో సేల్స్ లో దాదాపు ఎలక్ట్రిక్ లేదా హైబ్రీడ్ మోడల్స్ ను విక్రయించినట్లు కంపెనీ ప్రకటించుకుంది. అయితే మిగిలిన 67శాతం వాహనాల్లో ఎన్ని పెట్రోల్, ఎన్ని డీజిల్ వాహనాలు అనేది వోల్వో వెల్లడించలేదు.
కాగా యూరోప్ దేశాల్లో డీజిల్ వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోతున్నాయి. వోక్స్ వ్యాగన్ ఎమిషన్ చీటింగ్ స్కాండల్ తర్వాత చాలా మంది కార్ల తయారీదారులు డీజిల్ కార్ల ఉత్పత్తిని చాలా వరకూ తగ్గించేశారు. యూరోప్ లో 2015 నాటికే దాదాపు 50శాతం డీజిల్ వాహనాల తయారీ, అమ్మకం తగ్గిపోయిందని పలు నివేదికలు చెబుతున్నాయి. అది ఈ ఏడాది జూలైకి వచ్చే నాటికి 14 శాతానికి డీజిల్ వాహనాల అమ్మకాలు తగ్గిపోయాయి.
ఏదీ ఏమైనా ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ షురూ అయ్యింది. అన్ని దిగ్గజ కంపెనీలు నెమ్మదిగా పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో బ్యాటరీతో కూడిన హైబ్రీడ్ మోడళ్లను తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిల్లో వోల్వో కంపెనీ 2030 నాటికి లక్ష్యాన్ని నిర్ధేశించుకొని ముందుకు సాగుతోంది. ఆ సమయంలో కంపెనీ నుంచి పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలనే తయారు చేయాలనే ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..