US Visa Fee Hike: అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు.. ఒకవేళ రాకపోతే నో రిఫండ్!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులపై అక్కడి ప్రభుత్వం ఊహించని విధంగా భారీ ఆర్థిక భారాన్ని మోపింది. అత్యవసరంగా వీసా ఇంటర్వ్యూ స్లాట్ కావాలంటే ఏకంగా 71,775 రూపాయలు అదనంగా చెల్లించాలంటూ కొత్త నిబంధన తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ఈ పైలట్ ప్రాజెక్టు అమల్లో ఉంటుందని వాషింగ్టన్ వర్గాలు వెల్లడించాయి..

US Visa Fee Hike: అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు.. ఒకవేళ రాకపోతే నో రిఫండ్!
US Visa Fee Increased

Updated on: Jun 09, 2026 | 6:18 PM

హైదరాబాద్‌, జూన్‌ 9: ప్రస్తుత వీసా విధానంలో సాధారణ అపాయింట్‌మెంట్ కోసం ఆరు నెలల నుంచి ఏడాదికి పైగా వేచి చూడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పది రోజుల్లోనే ఇంటర్వ్యూ స్లాట్ దక్కించుకోవడానికి ఈ అదనపు రుసుము చెల్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ 750 డాలర్ల రుసుము కేవలం ఇంటర్వ్యూ తేదీని మాత్రమే ఖరారు చేస్తుంది. దీనివల్ల వీసా వస్తుందనే గ్యారెంటీ ఏమాత్రం ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఇంటర్వ్యూకు హాజరు కాకపోయినా లేదా వీసా తిరస్కరణకు గురైనా ఈ డబ్బును తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ఇప్పటికే ఉన్న సాధారణ వీసా ఫీజు 185 డాలర్లతో పాటు జనవరి నుంచి అమల్లోకి వచ్చిన వీసా ఇంటెగ్రిటీ ఫీజు 250 డాలర్లు అదనం. వీటన్నింటికీ తోడు ఇతర ఛార్జీలు కూడా కలిపితే విమానం ఎక్కకముందే ఒక్కో దరఖాస్తుదారుడికి లక్షా 16 వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. హైదరాబాద్ లేదా ముంబై నుంచి విమాన టికెట్ల ఖర్చు కూడా కలిపితే మొత్తం రెండు లక్షల రూపాయలు దాటుతుంది. అమెరికా ఎంబసీకి చెందిన అధికారిక వీసా పోర్టల్ మే నెలలో సాంకేతిక లోపాలతో ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయింది. దీనివల్ల భారతదేశంతో పాటు మెక్సికో, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వేలాది మంది దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వ్యవస్థలోని లోపాల వల్ల పెరిగిన రద్దీని తగ్గించేందుకు వాషింగ్టన్ ఈ అదనపు వసూళ్ల మార్గాన్ని ఎంచుకుంది.

ఇవి కూడా చదవండి

ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీసా ఖర్చులు గడిచిన ఏడాదిలో రెండున్నర రెట్లు పెరిగాయి. దీనివల్ల ముఖ్యంగా అమెరికాలో స్థిరపడిన పిల్లలను చూసేందుకు వెళ్లే భారతీయ వృద్ధులకు పెద్ద సమస్యగా మారింది. పదవీ విరమణ చేసి పరిమిత ఆదాయంతో జీవించే వృద్ధ తల్లిదండ్రులకు ఈ అదనపు భారం మోయలేనిదిగా తయారైంది. ఒకవేళ వీసా రాకపోతే ఈ భారీ మొత్తం పూర్తిగా నష్టపోవాల్సి వస్తుందని దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. జూలై ఒకటిన ఏయే నగరాల్లోని కాన్సులేట్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించనున్నారు. నిబంధనలు కఠినతరం కావడంతో పాటు ఖర్చులు విపరీతంగా పెరగడం మధ్యతరగతి ప్రయాణికులకు పెద్ద శరాఘాతంగా మారింది.

Follow Us