Privatization: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కసరత్తు జరుగుతోంది. రాబోయే నెలల్లో ప్రభుత్వం ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు సమాచారం అందించాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన యూనియన్ బడ్జెట్‌లో.. ఏడాదిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ రంగ సంస్థల వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఈ నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
వీటికి తోడు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ డిజిన్వెస్ట్‌మెంట్ కూడా ప్రక్రియలో ఉంది. దీని కోసం తాజా బిడ్‌లను ఆహ్వానిస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి ఒక్క బిడ్డర్ మాత్రమే మిగిలి ఉన్నాడని.., దీంతో ప్రభుత్వం సేల్ బిడ్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. BPCLలో ప్రభుత్వం తనకున్న 52.98 శాతం వాటాను అమ్మేయాలని చూస్తోంది. దీని కోసం, నవంబర్, 2020 వరకు కనీసం మూడు బిడ్‌లు అందాయి. అయితే ఇతరులు ఉపసంహరించుకోవడంతో ఒక బిడ్డర్ మాత్రమే చివరికి మిగిలాడు. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక విక్రయంపై కొన్ని సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించిన తర్వాత దానిలోని ప్రభుత్వ వాటాలను సైతం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు.. ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లను కేంద్రం ప్రైవేటీకరించవచ్చని తెలుస్తోంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా.. క్యాబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని ప్రధాన కార్యదర్శుల బృందం ఆమోదం కోసం దీని సిఫార్సులను ప్రత్యామ్నాయ యంత్రాంగానికి (AM) పంపుతుంది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం దానికి తుది ముద్ర వేసి ఆమోదించనుంది.