గత రెండేళ్ల నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యల కారణంగా పెట్టుబడులపై వడ్డీ రేట్లు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకర్లు గణనీయంగా వడ్డీ రేట్లను పెంచారు. అయితే గత రెండు త్రైమాసికాల నుంచి రెపో రేటును యథాతథంగా ఉంచడంతో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ పడింది. దీంతో 2023 ప్రథమార్థంలో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పథకం ఇప్పుడు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పీపీఎఫ్, కిసాన్ వికాస్ పత్ర కంటే మెరుగైన వడ్డీ రేట్లను అందిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్‌ఎస్‌సీ వడ్డీ రేటును మునుపటి త్రైమాసికంలో 7 శాతం నుంచి 7.7 శాతానికి పెంచింది. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేకపోయినా ఈ పథకం ఇప్పటికీ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాల కంటే మెరుగైన వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాకుండా అన్ని చిన్న పొదుపు పథకాల్లో ఎన్‌ఎస్‌సీ ప్రస్తుతం ఎస్‌సీఎస్‌ఎస్ (8.2శాతం), ఎస్‌ఎస్‌వై (8 శాతం) తర్వాత మూడో అత్యధిక వడ్డీ రేటును అందిస్తోంది. చిన్న పొదుపు పథకాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, కిసాన్ వికాస్ పత్ర, పోస్టాఫీస్ ఆర్‌డీ, ఎఫ్‌డీ నెలవారీ ఆదాయ ఖాతాలు ఎన్‌ఎస్‌డీ వడ్డీ రేటు కంటే తక్కువ అందిస్తున్నాయి.
ఎన్‌ఎస్‌సీ ఖాతా 5 సంవత్సరాలలో మెచ్యూర్ అవుతుంది. మీరు ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000 నుంచి ప్రారంభించి, ఆ తర్వాత రూ. 100 గుణిజాల్లో ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఎన్‌ఎస్‌సీ ఖాతాలో పెట్టుబడి పెట్టగల మొత్తంపై గరిష్ట పరిమితి లేదు. ప్రస్తుత 7.7 శాతం వడ్డీ ప్రకారం, రూ.10,000 పెట్టుబడి మెచ్యూరిటీపై రూ.14,490కి పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఎన్‌ఎస్‌సీ ఖాతాలో రూ. 1 లక్ష పెట్టుబడి పెడితే మీరు 5 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీపై రూ.1,44,900 పొందుతారు.
ఎన్‌ఎస్‌సి వడ్డీ వార్షికంగా సమ్మేళనం చేస్తారని పెట్టుబడిదారులు తెలుసుకోవాలి. అలాగే ఈ పథకంలో సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి కింద మినహాయింపుకు అర్హత పొందుతాయి. ఎన్‌ఎస్‌సీ పథకం ప్రస్తుత వడ్డీ రేటు బ్యాంకులు అందించే 5 సంవత్సరాల పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైనదిగా ఉంది. అలాగే సంవత్సరానికి రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ మొత్తాలకు కూడా భారత ప్రభుత్వ సార్వభౌమ హామీతో ఎన్‌ఎస్‌సీ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైనదని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..