Akshaya Tritiya 2023: బంగారం కొనుగోలు చేయాలనుకొంటున్నారా? ఇవి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు?

మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఇంట్లో మహిళలకు బంగారు వస్తువులు, మీ పిల్లలకు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ వార్త అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి.

Akshaya Tritiya 2023: బంగారం కొనుగోలు చేయాలనుకొంటున్నారా? ఇవి తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు?
Gold Price Today

Updated on: Apr 17, 2023 | 6:00 PM

హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. లక్ష్మీదేవి భక్తుల మధ్య కొలువుదీరిన రోజుగా దీనిని భావిస్తారు. శుభాలకు ఆహ్వానం పలికే రోజుగా దీనిని పరిగణిస్తారు. అందుకే వాహనాలు, నగలు, ఇళ్ళు, అనేక ఇతర విలువైన ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రజలు మొగ్గుచూపుతారు. ఈ అక్షయ తృతీయనే అఖ తీజ్‌ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్ల పక్ష తృతీయ నాడు అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఏప్రిల్‌ 22న వచ్చింది. ఆ రోజున చాలా మంది బంగారు వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మీరు కూడా అక్షయ తృతీయ రోజున ఇంట్లో మహిళలకు బంగారు వస్తువులు, మీ పిల్లలకు ఆభరణాలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ వార్త అస్సలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే ఏప్రిల్‌ 1 నుంచి బంగారు వస్తువులు, ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. నకిలీ బంగారం కొనుగోలు చేయకుండా కొనుగోలుదారులు ఈ నిబంధనలను తెలుసుకోవాలి. మీరు మోసపోకుండా ఉండాలంటే ఆ నిబంధనల గురించి తెలుసుకోవాల్సిందే. లేకుంటే చాలా నష్టపోతారు. అవేంటో చూద్దాం రండి..

వాటి అమ్మాకాలపై నిషేధం.. బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకారం, మార్చి 31, 2023 తర్వాత ఆరు-అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (హెచ్ యూఐడీ) లేకుండా హాల్‌మార్క్‌ బంగారం అమ్మకాన్ని నిషేధించింది. బంగారు స్వచ్ఛతను, నాణ్యతను తెలియజేసే విధంగా యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌(హెచ్‌యూఐడీ) బంగారంపై ఉండాలి. ఇది ఆరు అంకెలను కలిగి ఉంటుంది.

మరి పాత బంగారం ఎలా?.. అయితే వినియోగదారుల వద్ద ఇప్పటికే ఉన్న హాల్‌మార్క్ ఉన్న ఆభరణాలు చెల్లుబాటులో ఉంటాయి. బీఐఎస్‌ రూల్స్‌ 2018 సెక‌్షన్‌ 49 ప్రకారం.. ఆభరణాలపై పేర్కొన్న దానికంటే తక్కువ స్వచ్ఛతతో ఉన్నట్లు గుర్తించనట్లయితే కొనుగోలు దారులు నష్టపరిహారం పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

స్వచ్ఛతను ఇలా పరిశీలించాలి.. హెచ్‌యూఐడీ హాల్‌ మార్క్‌ 3 మార్కులను కలిగి ఉంటుంది. బీఐఎస్‌ లోగో, బంగార స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్‌ హెచ్‌యూఐడీ ఉంటాయి. ఒక్కో బంగారు వస్తువు లేదా ఆభరణానికి ఒక్కో విశిష్టమైన ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌ ఉంటుంది.

బీఐఎస్‌ లోగో ఉండాలి.. బీఐఎస్‌ అంటే బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్స్‌. ప్రతి బంగారు వస్తువు, ఆభరణంపైనా బీఐఎస్‌ లోగో ఉంటుంది. ఇది ఉంటే ఆ ఆభరణం బీఐఎస్‌ అధీకృత ల్యాబ్‌ లో పరీక్షించి ధ్రువీకరించినట్లు అర్థం. కొనుగోలుదారుల బంగారు ఆభరణంపైనా ఈ లోగో ఉందోలేదో తప్పనిసరిగా చూసుకోవాలి. భారతదేశంలోని బంగారు వస్తువులు ఆభరణాల స్వచ్ఛతను ధ్రువీకరించే ఏకైక సంస్థ బీఐఎస్‌.

స్వచ్ఛతకు గ్రేడ్‌ ఉంటుంది.. ఆభరణాలలో స్వచ్ఛమైన బంగారాన్ని ధ్రువీకరించే మరో గుర్తు ఫైన్‌నెస్‌ నంబర్‌, క్యారెట్‌(కేటీ లేదా కేగా పేర్కొంటారు. వెండి, జింక్‌ వంటి ఇతర లోహాలతో కూడిన బంగారం మిశ్రమాలలో నాణ్యతను తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే 24 క్యారెట్ల బంగారం చాలా మృదువైనది కావడంతో ఆభరణాల కోసం ఇతర లోహాలను దీనికి కలుపుతారు. 916 అనే ఫైన్‌నెస్‌ నంబర్‌. 22 క్యారెట్ల బంగారానికి మరో పదం. ఉదాహరణకు 22 క్యారెట్ల బంగారం 100 గ్రాముల బరువు ఉంటే అందులో 91.6 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.

ఆరు అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ కోడ్‌(హెచ్‌యూఐడీ).. బంగారు ఆభరనాలకు అస్సేయింగ్‌, హాల్‌ మార్కింగ్‌ సెంటర్‌ లో మాన్యువల్‌ గా ప్రత్యేక నంబర్‌ తో స్టాంప్‌ చేస్తారు. ప్రతి ఆభరణానికి ప్రత్యేకమైన హెచ్‌యూఐడీ ఉంటుంది. ఇది నమ్మకానికి, విశ్వసనీయతకు కీలకం.

ఈ సమయాల్లో బంగారం కొనండి..

అక్షయ తృతీయ ఏప్రిల్ 22, 2023న జరుపుకుంటారు. ఈ రోజున, పంచాంగం ప్రకారం బంగారం కొనడానికి అనుకూలమైన సమయాలు ఇవి..

  • ఉదయం ముహూర్తం: 7:49 నుండి 09:04 వరకు
  • మధ్యాహ్నం ముహూర్తం: 12:20 నుండి 05:13 వరకు
  • సాయంత్రం ముహూర్తం: 6:51 నుండి 8:13వరకు
  • రాత్రి ముహూర్తం: 9:35 నుండి 1:42( ఏప్రిల్ 23)
  • తెల్లవారుజామున ముహూర్తం: 4:26 నుండి 5:48 వరకు(ఏప్రిల్ 23)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..