Telugu News Business These are the differences between Bajaj Chetak 3001 and Suzuki E Access, check details in telugu
Best e-scooter: బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా..? దిబెస్ట్ స్కూటర్ ఇదే..!
మన దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల హవా విపరీతంగా పెరిగింది. ఎక్కడ చూసినా రోడ్లపై అవే పరుగులు తీస్తూ కనిపిస్తున్నాయి. పెట్రోలు వాహనాలకన్నా వీటిని కొనుగోలు చేయడానికే ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ డిమాండ్‌కు అనుగుణంగానే దాదాపు అన్ని ద్విచక్ర వాహన తయారీ కంపెనీలు తమ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఫీచర్లు, టెక్నాలజీ, రేంజ్, బ్యాటరీ తదితర విషయాల్లో ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే వారికి వీటిలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవడం కొంచెం సవాలే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో బజాజ్ చేతక్ 3001, కొత్తగా విడుదల కానున్న సుజుకీ ఇ-యాక్సెస్ స్కూటర్ల మధ్య తేడాలు, ఇతర వివరాలను తెలుసుకుందాం.
బజాజ్ కంపెనీకి మన దేశంలో ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సంస్థ నుంచి విడుదలైన చేతక్ 3001 ఇ- స్కూటర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. దీని ధర రూ.99,900 (ఎక్స్‌షోరూమ్) మాత్రమే. చేతక్ లైనప్‌లో అత్యంత తక్కువ ధరకు లభించే స్కూటర్ కూడా ఇదే. పైగా పట్టణంలో రాకపోకలకు వీలుగా దీన్ని రూపొందించారు. మరో వైపు సుజుకీ కంపెనీ నుంచి ఇ-యాక్సెస్ పేరుతో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల కానుంది. దీనిపై కూడా మార్కెట్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.
ధర
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల కంటే బజాజ్ చేతక్ 3001 ధర తక్కువగా ఉంది. కేవలం రూ.లక్ష లోపు ధరలోనే అందుబాటులోకి తీసుకువచ్చారు.
సుజుకీ ఇ-యాక్సెస్ ధరను అధికారికంగా వెల్లడించలేదు. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం రూ.1.10 లక్షల నుంచి రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా.
ప్రత్యేకతలు
బజాజ్ చేతక్ 3001లో 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో సింగిల్ చార్జింగ్‌పై సుమారు 127 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు గరిష్టంగా 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. సుమారు నాలుగు గంటల్లో సున్నా నుంచి 80 శాతం వరకూ బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. అయితే ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం లేదు.
సుజుకీ ఇ-యాక్సెస్‌లో కూడా 3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అమర్చారు. పూర్తిస్థాయి చార్జింగ్‌తో 95 కిలోమీటర్ల పరిధి ఇస్తుంది. దీనిలోని లిథియం ఐరన్ ఫాస్పేట్ బ్యాటరీ సెల్స్ పరిధి కంటే భద్రత, మన్నికను పెంచుతాయని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ చార్జర్‌తో కేవలం 2.45 గంటల్లో బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రామాణిక చార్జర్‌తో సుమారు 6.30 గంటలు పడుతుంది. గంటకు 71 కిలోమీటర్ల వేగంతో ఈ స్కూటర్ పరుగులు పెడుతుంది.
బజాజ్ చేతక్ 3001, సుజుకీ ఇ-యాక్సెస్ స్కూటర్లు రెండు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అయితే వేగవంతమైన చార్జింగ్ అవసరం లేకుండా, తక్కువ ధరకు బెస్ట్ స్కూటర్ పొందాలనుకునే వారికి బజాజ్‌చేతక్ బాగుంటుంది. కాగా.. ఫాస్ట్ చార్జింగ్, టాప్ స్పీడ్ కావాలనుకుంటే సుజుకీ ఇ-యాక్సెస్ మంచి ఎంపిక.