Children Bank Accounts: పిల్లలకూ బ్యాంకు ఖాతాలు.. ఆ నిబంధనలు పాటించడం మస్ట్

ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అత్యంత అవసరంగా మారింది. ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నందున అనివార్యమైంది. ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన బ్యాంకులో ఖాతా తీసుకుంటున్నారు. సాధారణంగా 18 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు ఖాతా తెరుస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ పిల్లలకు కూడా ఇప్పుడు బ్యాంకు ఖాతాలు తీసుకోవచ్చు. ఆ వివరాలు, నిబంధనలు ఇప్పుడు తెలుసుకుందాం.

Children Bank Accounts: పిల్లలకూ బ్యాంకు ఖాతాలు.. ఆ నిబంధనలు పాటించడం మస్ట్
Minor Bank Accounts

Updated on: Jul 09, 2025 | 5:13 PM

దేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాలు తీసుకోవచ్చు. దీనిలో రెండు రకాల కేటగిరీలు ఉన్నాయి. మొదటగా పదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలైతే బ్యాంకు ఖాతాను తల్లిదండ్రులు, చట్టపరమైన సంరక్షకుడి పేరుమీద నిర్వహించాలి. రెండో కేటగిరీలో పదేళ్లు దాటి 18 ఏళ్ల లోపు వారైతే కొన్ని నిబంధనలకు లోబడి, తల్లిదండ్రుల పర్యవేక్షణలో స్వతంత్రంగా ఖాతాను నిర్వహించవచ్చు. అంటే ఏటీఎం వినియోగం, పరిమిత ఆన్ లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు చేసుకోవచ్చు. ఇలా రెండు రకాల ఖాతాలు మైనర్లకు అందుబాటులో ఉన్నాయి.

మైనర్ల పేరు మీద బ్యాంకు ఖాతా ప్రారంభించడానికి వారి బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు, పాస్ పోర్టు సైజు ఫోటో అవసరం. వాటితో పాటు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఆధార్, పాన్ కార్డు జిరాక్స్ లు, పాస్ పోర్టు సైజు ఫొటోలు అందజేయాలి. ముందుగా మీ సమీపంలో మీకు నచ్చిన బ్యాంకుకు వెళ్లండి. మైనర్ ఖాతా ప్రారంభం కోసం దరఖాస్తును పూర్తి చేయండి. అవసరమైన పత్రాలు, ఫొటోలు అందజేయండి. ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ తదితర ఫీచర్లు ఎంపిక చేసుకోండి. దరఖాస్తు ఫారంపై సంతకాలు చేయండి. అనంతరం రెండు నుంచి ఐదు రోజుల్లో బ్యాంకు ఖాతా యాక్టివేట్ అవుతుంది.

ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలనుకునేవారు బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ఓపెన్ మైనర్ అక్కౌంట్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోండి. అక్కడ కనిపించిన దరఖాస్తును సక్రమంగా పూర్తి చేసి, అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి. అయితే కేవైసీ ధ్రువీకరణ కోసం బ్యాంకు శాఖకు వెళ్లే అవసరం ఉంటుంది.

పిల్లల పేరు మీద బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం వల్ల అనేక ఉపయోగాలు కలుగుతాయి. వారికి చిన్నతనం నుంచే పొదుపు అలవాటు అవుతుంది. డబ్బు నిర్వహణపై అవగాహన కలుగుతుంది. బ్యాంకు విధానాలు, లావాదేవీలు, డిజిటల్ సిస్టమ్ ను అర్థం చేసుకోగలుగుతారు. పొదుపు చేసిన చిన్న మొత్తాలు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. వాటిపై వడ్డీ సంపాదించే అవకాశం కలుగుతుంది.

పదేళ్లు దాటిన పిల్లలకు ఏటీఎం, నెట్ బ్యాంకింగ్ సౌకర్యం కల్పించినా వాటి నిర్వహణకు బ్యాంకు నిబంధనలు ఉంటాయి. ముఖ్యంగా ఏటీఎం ద్వారా రోజుకు రూ.2500 నుంచి 5 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో ఎక్కువగా చూడటానికి మాత్రమే అవకాశం ఉంటుంది. లావాదేవీలకు అనుమతి చాలా పరిమితంగా ఇచ్చారు. చెక్కు పుస్తకాలు అస్సలు ఇవ్వరు. కొన్ని లావాదేవీలకు సంరక్షకుడి అనుమతి అవసరం. తల్లిదండ్రుల ఆమోదంతోనే డెబిట్ కార్డులు జారీ చేస్తారు.

మైనర్లకు ఖాతాకు తెరిచిన తర్వాత వారికి 18 ఏళ్లుగా రాగానే వయోజనులుగా పరిగణించబడతారు. వారి బ్యాంకు ఖాతా.. సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. ఆ సమయంలో అవసరమైన కేవైసీ పత్రాలను బ్యాంకుకు సమర్పించాలి. ఆ ఖాతాపై సంరక్షకుడి అధికారం ముగుస్తుంది. కొన్ని బ్యాంకులు కొత్త ఖాతా నంబర్లను జారీ చేస్తాయి. మైనర్ ఖాతా ముగిసే సమయానికి కంటే ముందుగానే బ్యాంకులు మనకు సమాచారం అందజేస్తాయి.