నో కాస్ట్ EMI అంటే నిజంగా వడ్డీ ఉండదా.. కంపెనీల మాయాజాలం తెలిస్తే నోరెళ్లబెడతారు..
No Cost EMI: డబ్బులు లేకపోయినా నచ్చింది కొనొచ్చు.. పైగా ఒక్క రూపాయి వడ్డీ కట్టక్కర్లేదు.. అవును.. ఈ రోజుల్లో మార్కెట్‌ను ఊపేస్తున్న నో కాస్ట్ EMI ఆఫర్ల వెనుక ఉన్న అసలు మాయాజాలం ఇదే. అయితే రూపాయి లాభం లేకుండా కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు మనకు ఉచితంగా అప్పులు ఇస్తాయా? నో కాస్ట్ ఈఎంఐ అంటే నిజంగానే వడ్డీ లేని రుణమా.. లేక కంటికి కనిపించని పక్కా బిజినెస్ స్కెచ్చా? అనేది తెలుసుకుందాం..

ఈ రోజుల్లో ఈఎంఐ లేని ఇల్లు లేదా కుటుంబం ఉండడం చాలా అరుదు. చేతిలో ఒకేసారి పూర్తి డబ్బు పెట్టి ఫోనో, టీవీనో, ఫ్రిజ్జో కొనడం సామాన్యులకు భారం కాబట్టి.. మెజారిటీ ప్రజలు ఈఎంఐ ఆప్షన్‌నే ఎంచుకుంటున్నారు. దీనికి తోడు కంపెనీలు నో కాస్ట్ ఈఎంఐ అంటూ ఇచ్చే క్రేజీ ఆఫర్లను చూసి జనాలు ఎగబడుతున్నారు. ఎలాంటి వడ్డీ లేకుండా వస్తువు ఇంటికి వస్తుందని మురిసిపోతున్నారు. కానీ రూపాయి లాభం లేకుండా కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకులు వ్యాపారం చేయవు. నో కాస్ట్ ఈఎంఐ అంటే నిజంగానే ఉచితంగా రుణం ఇస్తున్నట్టా? దీని వెనుక దాగున్న హిడెన్ ఛార్జీల కథేంటి? ఒకేసారి కొనేదానికంటే వాయిదాలలో కొంటే ఎందుకు ఎక్కువ ఖర్చు అవుతుందో చాలా మందికి తెలియదు.
వడ్డీ నిజంగానే ఉండదా..?
చాలా మంది నో కాస్ట్ ఈఎంఐ అనగానే వడ్డీ లేని అప్పు అని పొరబడుతుంటారు. కానీ ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. దేశంలో ఏ బ్యాంకు కూడా వడ్డీ లేని రుణాలను ఇవ్వడానికి వీల్లేదు. మరి కంపెనీలు నో కాస్ట్ అని ఎలా ప్రకటిస్తాయి? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. దీని వెనుక ఇంట్రెస్ట్ సబ్సిడీ అనే బిజినెస్ మోడల్ ఉంటుంది. ఉదాహరణకు.. మీరు రూ.30,000 ఫోన్‌ను 3 నెలల నో కాస్ట్ ఈఎంఐలో కొన్నారనుకుందాం. దానికి బ్యాంక్ వసూలు చేసే వడ్డీ రూ.1,500 అనుకుంటే.. సదరు మొబైల్ కంపెనీ ఆ రూ.1,500లను ఫోన్ అసలు ధరలోనే మీకు ముందే డిస్కౌంట్ రూపంలో తగ్గించేస్తుంది. అంటే మీకు ఫోన్ రూ.28,500లకే బిల్ అవుతుంది. కానీ బ్యాంక్ మాత్రం ఆ రూ.28,500పై రూ.1,500 వడ్డీ వేసి.. మీ నుండి మొత్తం రూ. 30,000 వసూలు చేస్తుంది. పైకి వడ్డీ లేనట్టే కనిపిస్తుంది కానీ స్క్రీన్ వెనుక వడ్డీ లెక్కలు పక్కాగా నడుస్తాయి.
అదనపు జీఎస్టీ వాత..
నో కాస్ట్ ఈఎంఐ కింద వస్తువును కొనుగోలు చేసినప్పుడు మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను నిశితంగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. బ్యాంకులు వడ్డీ మొత్తాన్ని విడిగా లెక్కిస్తాయి. ఇక్కడ కస్టమర్లకు తెలియని దెబ్బ ఏంటంటే.. బ్యాంకు విధించే ఆ వడ్డీ మొత్తంపై ప్రభుత్వం విధించే 18శాతం జీఎస్టీని కస్టమర్ తన జేబు నుండి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ జీఎస్టీ మొత్తాన్ని ఏ కంపెనీ కూడా డిస్కౌంట్ రూపంలో తిరిగి ఇవ్వదు. కాబట్టి నో కాస్ట్ అన్నా సరే జీఎస్టీ భారం పడటం ఖాయం.
డైరెక్ట్ డిస్కౌంట్లు రద్దు
చాలా సందర్భాలలో కంపెనీలు కస్టమర్లకు డబుల్ బెనిఫిట్ ఇవ్వవు. మీరు గనుక క్రెడిట్ కార్డుపై వచ్చే తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఉపయోగించుకోవాలనుకుంటే.. అది కేవలం ఒకేసారి పూర్తి మొత్తాన్ని చెల్లించే ఆప్షన్‌కే వర్తిస్తుంది. ఒకవేళ మీరు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీకు లభించాల్సిన ఆ ముందస్తు డైరెక్ట్ డిస్కౌంట్ రద్దవుతుంది లేదా భారీగా తగ్గిపోతుంది. అంటే ఒకేసారి డబ్బులు పెట్టి కొంటే రూ. 2, 3 వేలు తగ్గే వస్తువును.. ఈఎంఐ లో కొనడం వల్ల మీరు ఆ డిస్కౌంట్‌ను పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది.
ప్రాసెసింగ్ ఫీజుల మోత
నో కాస్ట్ ఈఎంఐ లో దాగున్న మరో పెద్ద హిడెన్ ఛార్జ్.. ప్రాసెసింగ్ ఫీజు. ప్రతి బ్యాంక్ ఈఎంఐ లావాదేవీని ప్రారంభించినందుకు గానూ కస్టమర్ నుండి రూ.199 నుండి రూ. 299 వరకు వన్ టైమ్ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంది. దీనిపై మళ్లీ అదనంగా సర్వీస్ టాక్స్ ఉంటుంది. ఈ చిన్న చిన్న ఫీజులన్నీ కలిపి చూస్తే.. ఒక వస్తువును పూర్తి మొత్తాన్ని ఒకేసారి ఇచ్చి కొనడం కంటే ఈఎంఐ లలో కొనడానికే ఎక్కువ ఖర్చు అవుతుందని స్పష్టంగా అర్థమవుతుంది.
కాగా నో కాస్ట్ ఈఎంఐ అనేది పూర్తిగా ఉచితం కాదు, అదొక పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీ. మీ దగ్గర ఒకేసారి కట్టేందుకు పూర్తి డబ్బు ఉండి, మంచి బ్యాంక్ డిస్కౌంట్ వస్తుంటే.. ఒకేసారి పేమెంట్ చేసి వస్తువును కొనుగోలు చేయడం అన్ని విధాలా లాభదాయకం. అలా కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఈఎంఐ కి వెళ్లాల్సి వస్తే.. పైన చెప్పుకున్న జీఎస్టీ, ప్రాసెసింగ్ ఫీజులు, డిస్కౌంట్ నష్టాలను ముందే లెక్కేసుకుని అడుగు ముందుకు వేయడం తెలివైన పని.
