No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐలో నిజమెంత? పండగ ఆఫర్ల‌లో షాపింగ్ చేసేవారికి ఈ జాగ్రత్తలు మస్ట్!

పండుగ సీజన్ వస్తే చాలు, ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు ఆఫర్ల వర్షం కురిపిస్తాయి. వాటిలో వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకునేది 'నో కాస్ట్ ఈఎంఐ' ఆఫర్. పేరుకు మాత్రమే 'నో కాస్ట్' అని ఉంటుందా, నిజంగా దీనిలో ఎలాంటి వడ్డీ, అదనపు ఖర్చులు ఉండవా? బయటకు ఉచితంగా కనిపించే ఈ పథకం వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం.

No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐలో నిజమెంత? పండగ ఆఫర్ల‌లో షాపింగ్ చేసేవారికి ఈ జాగ్రత్తలు మస్ట్!
No Cost Emi

Updated on: Sep 09, 2025 | 4:52 PM

పండుగ కాలంలో అమ్మకాలను పెంచడానికి అనేక సంస్థలు, ఆన్‌లైన్ వ్యాపార వేదికలు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ పథకం కస్టమర్ల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నట్లు కనిపించినా, నిజానికి ఇది పరోక్ష ఖర్చులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు పండుగ అమ్మకాలను ప్రారంభించాయి. ఈ రెండు సంస్థలు పోటీపడి కస్టమర్లకు భారీ డిస్కౌంట్లలో వస్తువులను అమ్ముతున్నాయి. అదనంగా, నో కాస్ట్ ఈఎంఐ పేరుతో నెలవారీ వాయిదాలలో కొనుగోలు చేసేవారికి వడ్డీ వసూలు చేయమని ప్రకటిస్తున్నాయి. ఇది కస్టమర్లకు నిజంగా లాభమా అని తెలుసుకుందాం.

‘నో కాస్ట్ ఈఎంఐ’ నిజ స్వరూపం

సాధారణంగా ఒక వస్తువును కొన్నప్పుడు వడ్డీ లేకుండా నెలవారీ వాయిదా వసూలు చేసే పథకమే నో కాస్ట్ ఈఎంఐ. అంటే, మనం కొనే వస్తువుల ధరను వాయిదాలుగా విభజించి చెల్లించవచ్చు. దీనికి ప్రత్యేకంగా వడ్డీ ఏదీ వసూలు చేయరు. కానీ, ఇలా కొనడం ఎల్లప్పుడూ లాభదాయకం కాదు. వడ్డీ వసూలు చేయమని చెప్పే సంస్థలు వస్తువుల ధరను పెంచవచ్చు. అలాగే, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు వసూలు చేయవచ్చు.

పరోక్ష ఛార్జీల సమస్య

ఈ విషయమై ఆర్థిక నిపుణులు మాట్లాడుతూ, నో కాస్ట్ ఈఎంఐ పథకాలు తరచుగా అనవసరమైన వస్తువులను కొనడానికి ప్రేరేపిస్తాయి. వాయిదా భారం తగ్గుతుందని భావించి, మనం అదనంగా వస్తువులు కొంటాం. ఇది దీర్ఘకాలంలో మన పొదుపును ప్రభావితం చేయడంతోపాటు ఆర్థిక సమస్యలను కలిగిస్తుంది. నిజానికి, ఉచిత రుణం అనేది ఏదీ లేదు. విక్రేతలు వడ్డీని భరించి, కస్టమర్లకు వడ్డీ రహిత నెలవారీ వాయిదా చెల్లింపు అవకాశాన్ని ఇస్తారు. కానీ, దానికి బదులుగా ఇతర మార్గాలలో ఆ మొత్తాన్ని వసూలు చేస్తారు. ఇది ఒక ప్రమోషనల్ ప్లాన్ మాత్రమే అని నిపుణులు చెప్పారు.

వస్తువులు కొనే ముందు గమనించాల్సినవి

మీరు వస్తువులు కొనే ముందు మీరు ఎంచుకునే నెలవారీ వాయిదా పథకం మీ ఆదాయానికి సరిపోతుందో లేదో చూడాలి. అది మీ నెలవారీ ఖర్చులను ప్రభావితం చేయకూడదు. కొన్ని పథకాలలో ఒక నిర్దిష్ట కాలానికి మాత్రమే వడ్డీ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత వడ్డీ వసూలు చేస్తారు. దీనిని ముందుగానే సరిచూసుకోవాలి. ప్రతి నో కాస్ట్ నెలవారీ వాయిదా పథకంలో ఉన్న నిబంధనలను జాగ్రత్తగా చదివి, మొత్తం ఖర్చును లెక్కించాలి.