
ప్రస్తుత రోజుల్లో చాలా బ్యాంకులతో పాటు ఆర్థిక సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ద్వారా వినియోగదారులకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో ఏ వ్యాపారి కూడా నష్టానికి వ్యాపారం చేయాలని అనుకోడు. ఇది చాలా ప్రాథమిక సూత్రం. కానీ ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకులు నో కాస్ట్ ఈఎంఐ రుణాలు ఎందుకు మంజూరు చేస్తున్నాయి? ఈ రుణాలు తీసుకోవడం వల్ల లాభమా? నష్టమా? అనే విషయాలు చాలా మందికి తెలియదు. నో-కాస్ట్ ఈఎంఐ స్కీమ్స్ ద్వరా స్మార్ట్‌ఫోన్, రిఫ్రిజిరేటర్ వంటి గృహోపకరణాలు ఎక్కువ మంది కొంటున్నారు. గృహోపకరణాలకు ఒకేసారి ఎక్కువ సొమ్ము చెల్లించకుండా తక్కువ డౌన్ పేమెంట్‌తో వస్తువులను సొంతం చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఎలాంటి అదనపు వడ్డీ లేకుండా నెలవారీ చెల్లింపులు చేయడానికి సౌకర్యవంతమైన ఎంపికగా చాలా మంది భావిస్తున్నారు.
నో కాస్ట్ ఈఎంఐలు క్రెడిట్ బ్యూరోలకు నివేదిస్తారు కాబట్టి ఈ విధానం క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్మించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఈఎంఐ చెల్లింపులతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈఎంఐ మిస్ అయితే వడ్డీ చెల్లించాల్సి రావడంతో పాటు మీ సిబిల్ స్కోర్ పడిపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా వరకు నో కాస్ట్ ఈఎంఐకు పడే వడ్డీ వడ్డీని సాధారణంగా విక్రేత, ఓఈఎంలు లేదా ఫైనాన్సింగ్ భాగస్వామి సబ్సిడీ చేస్తారు లేదా ఉత్పత్తి ధరలో పొందుపరుస్తారు. చాలా మంది యువత కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకుంటే నో కాస్ట్ ఈఎంఐ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే క్రెడిట్ సులభంగా అందుబాటులో ఉండడంతో పాటు సకాలంలో ఈఎంఐలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్‌ను మెరుగు అవుతుంది.
కొన్ని సందర్భాల్లో నో కాస్ట్ ఈఎంఐలు ప్రతికూలంగా మారవచ్చు. మీరు తరచుగా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను ఉపయోగిస్తుంటే మీ క్రెడిట్ నివేదికలో మీకు అనేక ఓపెన్ లోన్ ఖాతాలు కనిపించవచ్చు. ఇది మీ క్రెడిట్ నివేదికలో మల్టీ ఓపెన్ క్రెడిట్ లోన్స్‌లా కనిపిస్తాయి. తద్వారా మీ క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకుని నో కాస్ట్ ఈఎంఐ తీసుకుంటే లాభమని, ఈఎంఐ చెల్లింపు మిస్ అయితే మాత్రం చాలా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..