బంగారం, వెండి ఎక్స్చేంజ్ ట్రేడెట్ ఫండ్స్ (ఈటీఎఫ్) పెట్టుబడిదారులకు లాభాలను అందిస్తున్నాయి. దీంతో ఎక్కువమంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కమోడిటీ ఆధారిత గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ లు 2024లో వరుసగా 20 శాతం, 19.66 శాతం సగటు రాబడిని అందించాయి. గోల్డ్ ఈటీఎఫ్ లలో హెచ్ డీఎఫ్ సీ ముందు వరుసలో కొనసాగుతోంది. ఈ ఏడాది దాదాపు 20.30 శాతం రాబడిని అందించింది. ఇన్వెస్కో ఇండియా 20.29, ఎల్ఐసీ ఎంఎఫ్ 20.25, మీరా అసెట్ 20.08, ఐసీఐసీఐ 20.07తో తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 19.94 శాతం రాబడిని అందించింది. మార్కెట్ లో ప్రస్తుతం 17 రకాల వెండి ఈటీఎఫ్ లు కొనసాగుతున్నాయి. వాటిలో హెచ్ డీఎఫ్ సీ సిల్వర్ ఈటీఎఫ్ 22.02 శాతం అత్యధిక రాబడిని అందించింది. నిప్పన్ ఇండియా 20.03, ఆదిత్య బిర్లా ఎస్ఎల్, యాక్సిస్, ఐసీఐసీఐ ప్రూ 20.01 చొప్పున, మీరా అసెట్ 20.0 శాతంతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
2024లో గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ దాదాపు ఒకే రకమైన రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి. వీటిలో దేనిలో పెట్టుబడి పెడితే మంచిదనే సందేహం నెలకొంది. ఈ నేపథ్యంలో నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పోగు చేసుకుంటున్నాయి. దీంతో బంగారం ధరలు గణనీయంగా పెరుగుతూ పోతున్నాయి. మరోవైపు వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో డిమాండ్ కు అనుగుణంగా వెండి ధరలు పరుగులు తీస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఉక్రెయిన్ యుద్దం కారణంగా భయానక వాతావరణం నెలకొంది. ఈ సమయంలో బంగారంపై పెట్టుబడులు ఎంతో సురక్షితమని ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా చైనా బంగారం నిల్వలను పెంచుకుంటూ పోతోంది. దీంతో ఈ ఏడాది దీనిపై ఆదాయం బాగుంది. అలాగే వెండికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సెమీ కండక్టర్ చిప్స్ లో దీని వాడకం పెరిగింది. కాగా. .గోల్డ్ ఈటీఎఫ్ లు చాలా కాలంగా మార్కెట్ లో ఉన్నాయి. కానీ వెండి ఈటీెఎఫ్ లు మాత్రం 2022లో మార్కెట్ లోకి ప్రవేశించాయి.
గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్ లు అంటే ఓ కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు. బంగారం, వెండిపై ఇవి పెట్టుబడులను పెడతాయి. వ్యక్తిగత స్టాక్స్ తరహాలోనే వీటి ట్రేడింగ్ జరుగుతుంది. అయితే ఇన్వెస్టర్ల దగ్గర భౌతికంగా బంగారం, వెండి ఉండదు. డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఉంటుంది. వీటి లావాదేవీలు చాలా సులభంగా జరుపుకోవచ్చు. అలాగే వంద రూపాయలు కూడా వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మార్కెట్ లోని భౌతిక బంగారం, వెండి ధరలకు అనుగుణంగానే ఇవి ట్రేడ్ అవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి