
సామ్సంగ్ నుంచి అత్యంత తక్కువ ధరకు 5జీ ఫోన్ విడుదలైంది. కేవలం రూ.పది వేల లోపు ధరలోనే సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్06 5జీ ఫోన్ ఆవిష్కరించారు. ఈ ఫోన్ ప్రత్యేకతలు, ఇతర వివరాలను తెలుసుకుందాం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్06 ఫోన్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ను కేవలం రూ.9,999 ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనిలోని 6.7 అంగుళాల డిస్ ప్లేతో విజువల్స్ చాాలా స్పష్టంగా ఉంటాయి. ఇది 90 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటుకు సపోర్టు చేస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్లస్ చిప్ సెట్ తో వన్ యూఐ సాఫ్ట్ వేర్ పై పనిచేస్తుంది.
ఈ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, సామ్సంగ్ అధికారిక వెబ్ సైట్, ఎంపిక చేసిన రిటైల్ భాగస్వామ్య దుకాణాల్లో కొనుగోలు చేయవచ్చు. విక్రయాలు మాత్రం ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మొదలవుతాయి. ఈ వెనిల్లా మోడల్ ఫోన్ రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన మోడల్ రూ.9,999కు, అలాగే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ కలిగిన మోడల్ రూ.10,999కి లభిస్తుంది. బహామా బ్లూ, లిట్ వైలెట్ అనే రెండు రకాల రంగుల్లో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కంపెనీ తక్షణ బ్యాంక్ క్యాష్ బ్యాక్ గా రూ.500 తగ్గింపును అందిస్తుంది. దీంతో బేస్ వేరియంట్ మోడల్ ను రూ.9,499కి సొంతం చేసుకోవచ్చు. కొత్త సామ్సంగ్ ఫోన్ వెనుక ప్యానెల్ ఆకర్షణీయమైన రంగుల్లో ఆకట్టుకుంటోంది. కెమెరా విషయానికి వస్తే వెనుక వైపు 50 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా ఏర్పాటు చేశారు.
25 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు. దీనిలోని రిపిల్ గ్లో ఫినిష్ కారణంగా ఫోన్ పై లైట్ పడినప్పడు మెరుస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ సెన్సార్, కాల్స్ మాట్లాడేటప్పడు బయటి శబ్దాలను నిరోధించే సామ్సంగ్ వాయిస్ ఫోకస్ ఫీచర్ అదనపు ప్రత్యేకతలు. అలాగే నాలుగు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్ డేట్స్ తో ఈ ఫోన్ ను విడుదల చేస్తున్నారు. సామ్‌సంగ్ విడుదల చేసిన ఈ కొత్త ఫోన్ పై మార్కెట్ లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ముఖ్యంగా రూ.పదివేల లోపు ధరలోనే తీసుకువచ్చిన ఈ 5జీ ఫోెన్ కు మార్కెట్ లో మంచి ఆదరణ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. నమ్మకమైన బ్రాండ్ కావడం, తక్కువ ధర కారణంగా విక్రయాలు జోరుగా జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి