దేశంలోనే ఐటీ సేవలు అందిస్తున్న ఐదవ అతిపెద్ద కంపెనీ అయిన టెక్ మహీంద్రా తన కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వంతో టెక్ హహీంద్రా ఓ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ రాష్ట్ర యువతకు ఉద్యోగవకాశాలు పెరగనున్నాయి. భవిష్యత్తులో టెక్ మహీంద్రా తన కార్యకలాపాలను గుజరాత్ లో విస్తరించడం ద్వారా రానున్న ఐదేళ్లలో కొత్తగా 3,000 మందిని తమ కంపెనీలో నియమించుకోనుంది. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదర్చుకుంది. సాధారణంగా ఐటీ కంపెనీలు లేదా ఏవైనా ప్రయివేటు కంపెనీలు ఉద్యోగ నియామకాలు చేపడితే దానికి సంబంధించిన ప్రకటన జారీచేయడం లేదా, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా నియామకాలు చేపట్టడం జరుగుతుంది. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ఐటీ పాలసీ ప్రకారం తమ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి.
ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ పాలసీ కింద గుజరాత్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు టెక్ మహీంద్రా తెలిపింది. నేడు ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుందని టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ CP గుర్నాని తెలిపారు. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్ ను ప్రోత్సహించడానికి గుజరాత్ ప్రభుత్వం చర్యలను ఆయన ప్రశంసించారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ పాలసీ ద్వారా ప్రముఖ సంస్థలతో 15వరకు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది.
ఈ ఒప్పందాల ద్వారా 26,750 మందికి ఐటీ రంగంలో ఉద్యోగాలు లభించనున్నాయి. నూతన ఐటీ పాలసీని తీసుకొచ్చిన ఏడు నెలల వ్యవధిలోనే 15 ప్రముఖ దేశీయ ప్రపంచ ఐటీ సంస్థలతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది గుజరాత్ సర్కార్. ఈ ఒప్పందాల ద్వారా డిజిటల్ రంగంలో మరిన్ని ఆవిష్కరణలు చేపట్టడానికి అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలను సృష్టించనుంది. టెక్ మహీంద్రాసంస్థ, గుజరాత్ ప్రభుత్వంతో కలిసి డిజిటల్ రంగంలో కొత్త ఆవిష్కరణలపై పనిచేయనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..