LIC Policy: చాలామంది భవిష్యత్ అవసరాల కోసం ఎల్‌ఐసీ పాలసీలు తీసుకుంటారు. అయితే ఒక్కోసారి ప్రీమియం చెల్లించడంలో సమస్య ఏర్పడినా లేదా పాలసీ విధానాలు నచ్చకపోయినా దానిని నిలిపివేయాలని అనుకుంటారు. అలా చేస్తే ఏం జరుగుతుంది. మీకు నష్టమా.. లాభమా.. సాధారణంగా పాలసీని మధ్యలోనే రద్దు చేసుకునే విధానాన్ని సరెండర్ అంటారు. ఇలా చేసినప్పుడు పాలసీదారుడికి తను కట్టిన పాలసీ డబ్బులు తిరిగి వస్తాయి. దీనిని సరెండర్ వాల్యూ అంటారు.
పాలసీ సరెండర్ చేసిన తర్వాత సరెండర్ మొత్తాన్ని పొందేందుకు బీమా కంపెనీ నిర్ణయించిన నిబంధనలను పాటించాలి. అంతేకాదు సరెండర్ ఛార్జీని చెల్లించాలి. ఇది ఒక్కో బీమా సంస్థకి ఒక్కో విధంగా ఉంటుంది. ఇది పాలసీ రకం, చెల్లించిన ప్రీమియం, మొత్తం ప్రీమియం చెల్లింపు వ్యవధి వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది. మీకు వచ్చే మొత్తం నుంచి సరెండర్ ఛార్జీ తీసివేస్తారు. ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది.
సరెండర్ విలువలో రెండు రకాలు ఉంటాయి. గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ, స్పెషల్ సరెండర్ వాల్యూ.
గ్యారెంటీడ్ సరెండర్ విలువ మూడేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే పాలసీదారుకు చెల్లిస్తారు. ఈ విలువ ప్లాన్ కోసం చెల్లించిన ప్రీమియంలో 30% వరకు మాత్రమే ఉంటుంది. అలాగే ఇందులో మొదటి సంవత్సరానికి చెల్లించిన ప్రీమియంలు, రైడర్‌లకు చెల్లించే అదనపు ఖర్చులు, బోనస్‌లు ఉండవు.
స్పెషల్ సరెండర్ వాల్యూని అర్థం చేసుకోవడానికి ఒక పద్దతి ఉంటుంది. పాలసీ తీసుకున్న వ్యక్తి కొన్నిరోజులు ప్రీమియం చెల్లించకపోయినా పాలసీని కొనసాగించవచ్చు. కానీ తక్కువ హామీ మొత్తంతో దీనిని పెయిడ్-అప్ విలువ అంటారు. చెల్లించిన ప్రీమియమ్‌ల సంఖ్య, చెల్లించాల్సిన ప్రీమియంల సంఖ్యతో బేసిక్ సమ్ అష్యూర్డ్‌ను గుణించడం ద్వారా చెల్లించిన విలువ లెక్కిస్తారు. పాలసీదారుడు పాలసీ సరెండర్ అభ్యర్థన ఫారమ్ నింపి బీమా కంపెనీకి సమర్పించాలి.