Sensex loss : వరుస లాభాలతో దూకుడు మీదున్న దేశీయ స్టాక్ మార్కెట్లకు కళ్లెం పడింది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ కీలకమైన 15,100 మైలురాయిని మరోసారి కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, మెటల్, ప్రైవేట్ బ్యాంకుల షేర్లు అమ్మకాల తీవ్ర ఒత్తిడిని లోనయ్యాయి. ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు రాణించడం కొంతమేర నిలదొక్కుకోగలిగింది.
గురువారం ఉదయం 50,711 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్.. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఒకానొక దశలో దాదాపు 900 పాయింట్ల వరకు కోల్పోయిన సూచీ.. మధ్యలో కాస్త కోలుకుని.. చివరకు 598.57 పాయింట్ల నష్టంతో 50,846.08 వద్ద ముగిసింది. అటు, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ నిఫ్టీ సైతం 164.80 పాయింట్ల నష్టంతో 15,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా నష్టాలను మూటగట్టుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇక, డాలరుతో రూపాయి మారకం విలువ 72.83గా ఉంది.
ఇదీ చదవండిః కేంద్రం ఇస్తానన్న ఏడాదికి కోటి ఉద్యోగాలు ఏవి..? బీజేపీ నేతలను నిలదీయాలని మంత్రుల పిలుపు