SBI Tatkal Tractor Loan: దేశీ దిగ్గజ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది. వివిధ రకాల రుణాలలో వడ్డీ రేట్లను తగ్గించడమే కాకుండా ప్రాసెసింగ్ ఫీజులోనూ రాయితీ కల్పిస్తోంది. ఇక తాజాగా అన్నదాతలకు తీపి కబురు అందించింది. ట్రాక్టర్ లోన్ తీసుకునే వారికి ప్రత్యేకమైన లోన్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతుల కోసం తత్కాల్ ట్రాక్టర్ లోన్ అందిస్తోంది.
ఎస్‌బీఐ తత్కాల్ ట్రాక్టర్ లోన్ కింద రుణం పొందాలని భావించే వారికి 100 శాతం డబ్బులు అందిస్తోంది. ట్రాక్టర్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఫీజు వంటి వాటికి కలుపుకొని ట్రాక్టర్ ధర ఎంత అవుతుందో.. దానికి సమానమైన డబ్బులను రుణం కింద తీసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఎస్‌బీఐ. అయితే ట్రాక్టర్‌పై తీసుకున్న ఈ రుణాన్ని 4 నుంచి 5 ఏళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. కనీసం 2 ఎకరాల పొలం కలిగిన రైతు బ్యాంకు నుంచి ట్రాక్టర్ లోన్ తీసుకోవచ్చు. ప్రతి రైతు కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుని ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు కావాల్సి ఉంటుంది. ఈ లోన్‌పై వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. బ్యాంకు నుంచి రుణం కావాలని కోరుకునే రైతుకు ఇది మంచి అవకాశం.
కాగా, ఇప్పటికే పలు బ్యాంకులు వివిధ రకాల రుణాలు అందిస్తోంది. పండగ సీజన్‌లో భాగంగా వినియోగదారులకు మరింత మేలు జరిగే విధంగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, బంగారం రుణాల, ఇతర రుణాలపై కూడా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. సులభమైన వాయిదా పద్దతుల్లో చెల్లించే విధంగా అతి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలను అందిస్తున్నాయి.