SBI Doorstep Banking: దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ‘డోర్‌స్టెప్ బ్యాంకింగ్’ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సర్వీసులు కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఖాతాదారులు మాత్రమే ఎస్‌బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సర్వీసులను పొందగలరు. అలాగే 70 ఏళ్లకు పైన వయసు కలిగిన సీనియర్ సిటిజన్స్‌కు, వికలాంగులకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అదేసమయంలో బ్యాంకుకు చెందిన అన్ని బ్రాంచులు ఈ సేవలు ఆఫర్ చేయవు. ఎంపిక చేసిన బ్రాంచుల్లో మాత్రమే డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఉన్నాయి.
ఇంటి వద్దే బ్యాంకింగ్ సర్వీసు కోసం రిజిస్టర్ మొబైల్ నెంబర్ తప్పనిసరి. అలాగే కస్టమర్ బ్యాంక్ బ్రాంచుకు 5 కిలోమీటర్ల లోపు నివసిస్తూ ఉండాలి. జాయింట్ అకౌంట్లు, మైనర్ అకౌంట్లను ఈ సేవలు లభించవు. అర్హత కలిగిన ఖాతాదారులు ఆర్థిక లావాదేవీకి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీకి రూ.60 కట్టాలి. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలు కోరుకునే వారు బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
ఎస్బీఐ డోర్‌స్టెప్ బ్యాంకింగ్ ద్వారా క్యాష్ పికప్, క్యాష్ డెలివరీ, చెక్ పికప్, డ్రాఫ్ట్ డెలివరీ, టర్మ్ డిపాజిట్, ఫామ్ 15 హెచ్ ఇలా పలు రకాల సేవలను ఇంటివద్దనే పొందొచ్చు.