SpiceJet: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ), స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్‌కు రూ.10 లక్షల జరిమానా విధించింది. DGCA తన బోయింగ్ 737 MAX విమానం పైలట్‌లకు సరిగ్గా లేని సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చినందుకు మే 30న ఈ పెనాల్టీని విధించింది. ఎందుకంటే ఇది విమానం భద్రతను ప్రభావితం చేస్తుంది. DGCA గత నెలలో 90 స్పైస్‌జెట్ పైలట్‌లను మాక్స్ విమానాలను నడపకుండా నిషేధించింది. పైలట్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని తెలుసుకున్నారు. పైలట్లపై నిషేధం విధించిన తర్వాత రెగ్యులేటర్ విమానయాన సంస్థకు షోకేస్ నోటీసు జారీ చేసింది. DGCA ప్రకారం.. విమానయాన సంస్థ పంపిన సమాధానం సరైనది కాదని తేలింది.
ఈ నేపథ్యంలో స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ దీనిపై సోమవారం వివరణ ఇచ్చింది. మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపేందుకు 650 మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించింది. అయితే 90 మంది పైలట్లు తప్పుడు సిమ్యులేటర్లపై శిక్షణ పొందినట్లుగా డీజీసీఏ గుర్తించినట్లు పేర్కొంది. డీజీసీఏ సూచనల మేరకు ఈ 90 మంది పైలట్లను మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నడపకుండా నిరోధించినట్లు తెలిపింది.
ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తాం:
కాగా, ఈ 90 మంది పైలట్లకు సరైన సిమ్యులేటర్లపై మళ్లీ శిక్షణ ఇస్తామని స్పైస్‌జెట్ వివరణ ఇచ్చుకుంది. వీరి శిక్షణపై డీజీసీఏ సంతృప్తి చెందితే మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు అనుమతిస్తామని వెల్లడించింది. ఈ చర్య వల్ల మాక్స్ విమానాల ఆపరేషన్స్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని స్పైస్‌జెట్ స్పష్టం చేసింది. తగినంత శిక్షణ పొందిన పైలట్లు సంస్థకు అందుబాటులో ఉన్నారని తెలిపింది.
కాగా, బోయింగ్ 737 మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడిపేందుకు తప్పుడు సిమ్యులేటర్లపై పైలట్లకు శిక్షణ ఇచ్చిన స్పైస్‌జెట్‌కు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది. అలాగే ఆ 90 మంది స్పైస్‌జెట్ పైలట్లు బోయింగ్ 737 మాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నడపకుండా చర్యలు చేపట్టింది. వారి శిక్షణ విమానం భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, దీంతో 90 మంది పైలట్లకు తిరిగి శిక్షణ ఇవ్వాలని స్పైస్‌జెట్‌ను డీజీసీఏ ఆదేశించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి