Sovereign Gold Bond Scheme 2021-22: బంగారంలో పెట్టుబడుల కోసం భారత ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ స్కీమ్‌లో భాగంగా నాలుగో విడత (2021-22) గోల్డ్ బాండ్ల జారీ జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం మే నుంచి సెప్టెంబర్ మధ్యకాంలో ఆరువిడతలుగా ఈ స్కీమ్ కింద గోల్డ్ బాండ్లను జారీ చేయాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. ఇందులో భాగంగా నాలుగో విడత గోల్డ్ బాండ్ల జారీకి ఏర్పాట్లు చేసింది. జులై 12 నుంచి 16 వరకు, ఐదు రోజులపాటు ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇష్యూ ధర గ్రాముకు రూ.4,807గా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వెల్లడించింది.
కాగా, కాంట్రిబూషన్‌కు ముందు వారం.. చివరి మూడు రోజుల్లో 999 ప్యూరిటీ పసిడి ధర ముగింపు సగటు ప్రాతిపదికన ఇష్యూ ధర నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేర్కొంది. జూలై 7, 8, 9 తేదీల్లో బంగారం ధర సగటును అనుసరించి గ్రాము రేటును నిర్ణయించినట్లు తెలుస్తోంది. మే 31వ తేదీ నుంచి జూన్ 4వరకు అమల్లో ఉన్న మూడవ విడత స్కీమ్ ధర గ్రాముకు రూ.4,889గా ఉంది. దీంతోపాటు గ్రాముకు రూ. 50 తగ్గింపు ఆఫర్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. గోల్డ్ బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసే వారికి గ్రాముకు రూ. 50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అంటే ఇప్పుడు గ్రాముకు 4,757 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
అయితే భారత ప్రభుత్వం తరపున ఆర్బీఐ గోల్డ్ బాండ్లను జారీ చేస్తుంది. ప్రభుత్వమే ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టడంతో భద్రత విషయంలో ఎలాంటి అనుమానం లేకుండా పెట్టుబడి పెట్టవచ్చు. 2015 నవంబర్‌లో కేంద్రం గోల్డ్ బాండ్ స్కీమ్‌ను ప్రకటించింది.
అయితే గోల్డ్ బాండ్లలో పెట్టుబడులు పెట్టే వారు బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్స్ఛేంజిలలో వాటిని కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ బాండ్ల కాలపరిమితి 8 ఏళ్లు. అయితే అత్యవసరం అనుకుంటే ఐదేళ్ళ తరువాత ఈ బాండ్లను అమ్ముకోవచ్చు. గోల్డ్ బాండ్లపై వడ్డీ కూడా వస్తుంది.