ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్.. కంపెనీల మధ్య పోటీ వాతావరణాన్ని సృష్టిస్తోంది. దీంతో వినియోగదారులకు మేలు చేస్తోంది. ఒకదానికి మించి మరొకటి ఆఫర్లను ప్రకటిస్తూ.. కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లో ఆకర్షణీయమైన వస్తువులుగా మార్చేస్తున్నాయి. ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తుండటంతో అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులపై ఈ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీదారు సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై మంచి ఆకర్షణీయ ప్యాకేజీని అందిస్తోంది. అవి డైరెక్ట్ తగ్గింపులు కాదు కానీ.. వారంటీ ప్రోగ్రామ్స్ ను ప్రకటించింది. సింపుల్ ప్రోటెక్ట్, సింపుల్ సూపర్ ప్రొటెక్ట్ ఎక్స్ టెండెడ్ వారంటీ ప్రోగ్రామ్స్ పేరుతో వాటిని తీసుకొచ్చింది. వీటి ద్వారా స్కూటర్లోని బ్యాటరీ, మోటార్ లను సంరక్షణకు, భద్రతకు భరోసాను కల్పిస్తోంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా సింపుల్ ఎనర్జీ ఎనిమిదేళ్లు లేదా 60,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువ కాలం పాటు వారంటీ అందిస్తున్న దేశంలోని తొలి ఓఈఎం గా సింపుల్ ఎనర్జీ నిలిచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
సింపుల్ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ తమ పేటెంట్ మోటారుపై 8 సంవత్సరాల వారంటీని అందించే మొదటి సంస్థగా తాము నిలిచినందుకు సంతోషిస్తున్నామన్నారు. ఆవిష్కరణ, అసాధారణమైన నాణ్యతపై తమ నిబద్ధతను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎక్స్ టెండెడ్ 8 సంవత్సరాల మోటారు, బ్యాటరీ వారంటీ ద్వారా వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవడం, తీర్చడం అనేది తమ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు.
సింపుల్ ఎనర్జీ దేశవ్యాప్తంగా 7 స్టోర్లను కలిగి ఉంది. రాజాజీనగర్, మారతహళ్లి, బెంగళూరులోని జేపీ నగర్, గోవా, విజయవాడ, పూణే, కొచ్చి వంటి నగరాల్లో స్టోర్లను కలిగి ఉంది.
సింపుల్ ఎనర్జీ దాని పోర్ట్‌ఫోలియోలో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి 212 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌తో సింపుల్ వన్, రెండోది 151 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌తో సింపుల్ వన్. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించడానికి, అమ్మకాలను పెంచడానికి, సింపుల్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల మోటార్, బ్యాటరీపై పొడిగించిన వారంటీతో ముందుకు వచ్చింది.
2019లో స్థాపితమైన సింపుల్ ఎనర్జీ ఓలా ఎలక్ట్రిక్, ఏథర్‌తో పాటు భారతదేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. అయినప్పటికీ, ఓలా, ఏథర్‌లతో పోల్చితే సింపుల్ ఎనర్జీ కొనుగోలుదారులను ఆకర్షించడంలో అంత విజయవంతం కాలేకపోయింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..