వెండి విశ్వరూపం.. 2026లో కిలో రూ. 4 లక్షలు..? సిల్వర్ ధరలపై షాకింగ్ రిపోర్ట్..
Silver Price Prediction 2026: ఒకప్పుడు సామాన్యుడి బంగారంగా పిలవబడిన వెండి.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రపంచంలో మెగా స్టార్‌లా దూసుకుపోతోంది. 2025లో ఇప్పటికే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసిన వెండి ఇప్పుడు రికార్డు ధర దిశగా పరుగులు పెడుతుంది. అసలు వెండి ఇంతలా ఎందుకు పెరుగుతోంది? ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారాన్ని మించిపోతున్న వెండి దూకుడు.. 2026లో సరికొత్త రికార్డులు సృష్టించబోతోందా..? పెట్టుబడిదారుల సంపద రెట్టింపు కానుందా..? వెండి ధరలపై సామ్కో సెక్యూరిటీస్ వేసిన ధైర్యమైన అంచనా ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. దేశీయ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ SAMCO సెక్యూరిటీస్ తాజా విశ్లేషణ ప్రకారం.. వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా కిలోకు రూ. 3.94 లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. 2025లో ఇప్పటికే ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసిన వెండి, 2026లో కూడా అదే జోరును కొనసాగిస్తుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 2026లోనే సుమారు 25శాతానికి పైగా వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
వెండి ధర ఇంతలా పెరగడానికి కేవలం డిమాండ్ మాత్రమే కాదు, అనేక అంతర్జాతీయ పరిణామాలు కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
సరఫరా కొరత: ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తి మరియు సరఫరా గణనీయంగా తగ్గుతోంది. గనుల నుంచి వెలికితీత తగ్గడం ధరలపై ప్రభావం చూపుతోంది.
సాంకేతిక పరిణామాలు: గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వాహనాల తయారీలో వెండి వినియోగం విపరీతంగా పెరిగింది. ఈ పారిశ్రామిక డిమాండ్ వెండికి భారీ ఊపునిస్తోంది.
కమోడిటీ సూపర్‌సైకిల్: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లలో కమోడిటీ సూపర్‌సైకిల్ నడుస్తోంది. దీనివల్ల లోహాల ధరలు సహజంగానే పెరుగుముఖం పట్టాయి.
ద్రవ్యోల్బణం – వడ్డీ రేట్లు: గ్లోబల్ ఇన్ఫ్లేషన్ డేటా మరియు సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు వెండిని సురక్షితమైన పెట్టుబడిగా మార్చాయి.
పెట్టుబడిదారులకు పండగే
2025లో వెండిలో పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పటికే భారీ లాభాలు దక్కాయి. ఇప్పుడు 2026 అంచనాలు కూడా సానుకూలంగా ఉండటంతో, సామాన్యుల నుంచి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరి చూపు వెండిపైనే ఉంది. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వెండి అంతకంటే వేగంగా లాభాలను తెచ్చిపెడుతుండటం గమనార్హం.
ఒకప్పుడు సామాన్యుడి బంగారంలా పిలవబడే వెండి, ఇప్పుడు పెట్టుబడి ప్రపంచంలో మెగా స్టార్‌లా దూసుకుపోతోంది. సామ్కో సెక్యూరిటీస్ అంచనాలు నిజమైతే, రాబోయే రెండేళ్లలో కిలో వెండి ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడం ఖాయం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
