Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..

|

Mar 28, 2022 | 4:35 PM

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల బాట పట్టాయి. దేశీయ సూచీలు నేటి సెషన్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి.

Stock Market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 231, నిఫ్టీ 69 పాయింట్లు అప్..
Stock Market
Follow us on

వరుస నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం లాభాల బాట పట్టాయి. దేశీయ సూచీలు నేటి సెషన్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చైనా(China) ఆర్థిక కేంద్రమైన షాంఘైలో కోవిడ్ -19 కారణంగా లాక్‌డౌన్‌(Lock Down)ను ప్రకటించిన తర్వాత ఆసియా మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ముడి చమురు ధరలు ఈ రోజు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ బ్యారెల్‌ ధర 116.33 డాలర్లకు పడిపోయింది. దీంతో సోమవారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 231 పాయింట్లు పెరిగి 57,593 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 17,222 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.18 శాతం, స్మాల్ క్యాప్ 0.73 శాతం నష్టపోయాయి.

1,178 కంపెనీల షేర్లు పెరగ్గా, 2,331 కంపెనీల షేర్లు తగ్గాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐటిసి, ఎస్‌బిఐ, ఇండస్‌ఇండ్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. పీవీఆర్, ఐనక్స్ కంపెనీలు విలీనమవుతాయని వార్తలు రావడంతో PVR షేర్లు 3.53 శాతం వరకు పెరిగాయి. INOX షేర్లు 11.75 శాతం మేర పెరిగాయి. నెస్లే ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌సిఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, విప్రో, ఎల్‌అండ్‌టి నష్టాల్లో ముగిశాయి.

నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 1.22 శాతం, నిఫ్టీ బ్యాంక్ 0.85 శాతం పెరిగాయి. భారతీ ఎయిర్‌టెల్ నిఫ్టీలో టాప్‌గెయినర్‌గా నిలిచింది. ఆ కంపెనీ స్టాక్ 3.90 శాతం పెరిగి రూ. 737 వద్ద స్థిరపడింది. డిమెర్జర్ తర్వాత మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా (MSWIL) సోమవారం స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. రూ.66 వద్ద లిస్ట్ అయిన తర్వాత రూ.69.30 గరిష్ఠానికి చేరికుని చివరికి 62.70 వద్ద స్థిరపడింది.

Read Also.. Jio Recharge Plan: ఇకపై నెల రోజులకు ఒకేసారి రీఛార్జ్‌.. యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్‌..