రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో పురోగతి ఉంటుందన్న వార్తలతో ముడి చమురు(Crude Oil) ధరలు తగ్గుముఖం పడుతోన్నాయి. దీంతో స్టాక్ మార్కెట్లు(Stock Market) సోమవారం వరుసగా ఐదో సెషన్‌లోనూ లాభాలతో ముగిశాయి. క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 2.65 శాతం తగ్గింది. యుఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) ముడి చమురు 3 శాతానికి పైగా క్షీణించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసినప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి. దీంతో చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో మూడో స్థానంలో ఉన్న భారత్‌పై ప్రభావం పడింది. స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నాయి.
సోమవారం 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్ 936 పాయింట్లు పెరిగి 56,486 వద్ద స్థిరపడగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 241 పాయింట్లు పెరిగి 16,871 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.20 శాతం, స్మాల్ క్యాప్ 0.22 శాతం పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 2.22, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.16 శాతం పెరిగాయి. అయితే, నిఫ్టీ మెటల్ 0.47 శాతం, నిఫ్టీ ఫార్మా 0.47 శాతం పడిపోయాయి.
ఇన్ఫోసిస్ 3.79 శాతం పెరిగి రూ. 1,891కి చేరుకోవడంతో నిఫ్టీలో టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా లాభపడ్డాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్‌డీఎఫ్‌సీ డిజిటల్ కార్యకలాపాలపై విధించిన పరిమితులను ఎత్తివేసిన తర్వాత ఆ స్టాక్ 3.25 శాతం పెరిగింది. Paytm పేరెంట్ కంపెనీ One 97 కమ్యూనికేషన్స్ కొత్త కస్టమర్‌లను చేర్చుకోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధించింది. దీంతోపాటు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చిన తర్వాత ఆ స్టాక్ 12.84 శాతం పోడిపోయింది.
బీఎస్‌ఈలో 1,750 కంపెనీల షేర్లు పెరగ్గా..1,723 కంపెనీల షేర్లు క్షీణించాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఎస్‌బిఐ, మారుతీ, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ టాప్ గెయినర్‌లలో ఉన్నాయి. దీనికి భిన్నంగా హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్ నష్టాల్లో ముగిశాయి.
Read also.. LPG Cylinder: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆ సిలిండర్ రూ. 634కే అందిస్తున్న ఆ కంపెనీ..!