
మంగళవారం లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు(Stock Market) బుధవారం నష్టాలను చవిచూశాయి. ఆర్థిక వృద్ధి భయాలు, తూర్పు యూరప్‌కు రష్యా గ్యాస్ సరఫరాను తగ్గించనుందనే వార్తలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. BSE సెన్సెక్స్ 537 పాయింట్లు తగ్గి 56,819 వద్ద స్థిరపడింది. NSE నిఫ్టీ 162 పాయింట్లు పడిపోయి 17,038 వద్ద ముగిసింది. నిన్నటి సెషన్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లు పెరగ్గా.. నిఫ్టీ(Nifty) దాదాపు 1.5 శాతం పెరిగింది. ముఖ్యంగా US ఫెడరల్ రిజర్వ్ చర్యలు,చైనా యొక్క కఠినమైన ఆంక్షలు పెట్టుబడిదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం మంగళవారం నాడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ. 1,174.05 కోట్ల విలువైన దేశీయ షేర్లను విక్రయించారు.
సెన్సెక్స్ 30 సూచీలో ఆరు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డ వాటిలో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటన్, డాక్టర్ రెడ్డీస్, విప్రో, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎంఅండ్‌ఎం, మారుతీ, సన్ ఫార్మా షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఐపీఓ రెండో రోజు సబ్‌స్క్రిప్షన్‌లో 2.57 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ విభాగంలో 3.41 రెట్ల అధిక స్పందన లభించింది. ఈరోజు ప్రారంభమైన రెయిన్‌బో చిల్డ్రన్ మెడికేర్ ఐపీఓకి స్పందన పెద్దగా కనిపించలేదు. రిటైల్ విభాగంలో కేవలం 43 శాతం షేర్లకు మాత్రమే బిడ్లు దాఖలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి 26 శాతం షేర్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. మే 4న ఎల్‌ఐసీ ఐపీఓ రానున్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also.. LIC IPO: వచ్చే వారమే ఎల్‌ఐసీ ఐపీఓ.. పాలసీదారులకు రూ.60, ఉద్యోగులు రూ.45 సబ్సిడీ..