
వయోవృద్ధులతో పాటు పదవీ విరమణ పొందినవారి కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్ అమలు చేస్తోంది. అదే వయోవృద్ధుల పొదుపు పథకం (SCSS). ఈ పథకంలో డబ్బులు పొదుపు చేసుకునేవారికి మంచి రాబడి పాటు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పొదుపు పథకంలో డబ్బులు పెట్టడం వల్ల నెలకు రూ. 20 వేల వరకు సంపాదించవచ్చు. రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కావాలనుకునేవారికి ఇది బెస్ట్ స్కీమ్‌గా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం పథకం కావడంతో మీ డబ్బులు సురక్షితంగా ఉంటాయి. కేంద్రం ఎప్పటినుంచో ఈ సేవింగ్స్ స్కీమ్ అమలు చేస్తోండగా.. లక్షలాది మంది తమ నిధిని పొదుపు చేసుకుంటున్నారు. ఈ పథకంలో చేరితే ప్రయోజనాలు ఏంటి..? ఆదాయ ఎంత వస్తుంది?
వయోవృద్ధుల పొదుపు పథకం (SCSS) పదవీ విరమణ చేసిన వారికి ఎలాంటి రిస్క్ లేని ఆదాయాన్ని అందిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం వడ్డీ రేటు 8.2 శాతంగా ఉంది. సీనియర్ సిటిజన్లు నెలకు రూ. 20 వేలు సంపాదించాలంటే.. సంవత్సరానికి రూ. 2.4 లక్షల ఆదాయం సంపాదించాల్సి ఉంటుంది. ఇందుకోసం సుమారు రూ. 29.27 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. వడ్డీని ప్రతి నెలా కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. నెలవారీ ఆదాయం రూ. 20 వేలు పొందాలనుకుంటే త్రైమాసిక ఆదాయం రూ.60 వేలు సంపాదించాల్సి ఉంటుంది.
సుమారు రూ. 29.27 లక్షలు పెట్టుబడి పెడితే 8.2 శాతం వడ్డీ రేటు లెక్కిస్తే ప్రతి త్రైమాసికానికి సుమారు రూ. 60 వేల ఆదాయం పొందవచ్చు.
ప్రతి త్రైమాసికానికి వడ్డీ నేరుగా అకౌంట్‌లో జమ చేస్తారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1, జనవరి 1 తేదీలలో వడ్డీ చెస్తారు. అలాగే ఈ పథకంలో చేరితే పాత పన్ను విధానం ప్రకారం 1961 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఈ పథకం నుండి వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం వడ్డీ నిర్దేశిత పరిమితిని మించినట్లయితే టీడీఎస్ తీసివేస్తారు. దీనిని నివారించడానికి మీరు ఫారం 15G/15H దాఖలు చేయాలి.
SCSS ఖాతాను 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత మూసివేయవచ్చు. ఇక ఐదేళ్ల తర్వాత 3 సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.. ఆ తర్వాత కూడా మూసివేయవచ్చు. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో మరణించిన మరుసటి రోజు నుండి ఖాతాను పూర్తిగా మూసివేసే వరకు ఖాతాలోని డబ్బుపై ‘పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్’ రేటు ప్రకారం వడ్డీ చెల్లిస్తారు.