
గగన్ అనే వ్యక్తి ఒక పెద్ద తప్పు చేశాడు. అది అతనికి చాలా నష్టాన్ని కలిగించింది. అయితే ఈ పొరపాటు ఏమిటో.. దానివలన అతను ఏమి నష్టపోయాడో తెలుసుకుందాం. గగన్ కు ఓ కొత్త మెసేజ్ వచ్చినట్టు నోటిఫికేషన్ వచ్చింది. వెంటనే అతను ఆ మెసేజ్ చూసి.. దానిపై క్లిక్ చేశాడు. రైలు టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోండి. దీనికోసం IRCTC యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి సౌకర్యవంతంగా ప్రయాణించండి. లింక్ http://bit.ly/3kgnbqc ని అనుసరించండి అలాగే యాప్‌ను డౌన్‌లోడ్ చేయండి. మేము మీకు సేవ చేయడానికి ఎదురుచూస్తున్నాము. అనే మెసేజ్ కనిపించింది. ఇంకేముంది మనోడు.. వెంటనే లింక్‌పై క్లిక్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేశాడు. యాప్ ఇన్స్ స్టాల్ చేస్తున్న ప్రాసెస్ లో యాప్ చాలా యాక్సెస్ లు అడిగింది. వాటన్నిటికీ ఏమాత్రం ఆలోచించకుండా పర్మిషన్స్ ఇచ్చేశాడు.
ఇదీ అతను చేసిన పెద్ద తప్పిదం. తనకు వచ్చిన మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అది నిజమైనదేనా ఏదీ తెలుసుకోకుండానే.. అతను తెలియని లింక్‌పై క్లిక్ చేసి, ఆ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేశాడు. అంతేకాదు ఈ అప్లికేషన్ అడిగిందని రాకరకాల పర్మిషన్స్ కూడా వెనకా ముందూ చూడకుండా ఇచ్చేశాడు. దీని వలన గగన్ ఎలాంటి ప్రమాదంలో పడ్డాడో చూద్దాం.
గగన్ ఇప్పుడు నిరాశతో కూర్చున్నాడు. అసలు తాను ఈ యాప్ ఎందుకు డౌన్ లోడ్ చేశాను.. దానికి తన ఫోన్ కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఎందుకు ఇచ్చాను అనుకుంటూ పశ్చాత్తాప పడుతున్నాడు. ఎందుకంటే.. ఈ యాప్ ఇప్పుడు గగన్ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తం ఊడ్చేసింది. ఈ మోసంలో చిక్కుకుని, కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా పోగొట్టుకున్నాడో మీరు అర్ధం చేసుకోండి. అయితే ఇది ఒక్కటే కేసు కాదు. నకిలీ IRCTC యాప్ ద్వారా ప్రజలను మోసగించిన సంఘటనల సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ దీని గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి ట్విట్టర్‌లో వరుసగా అలర్ట్ లు ఇస్తూ వస్తోంది. అంతకు ముందు ఏప్రిల్ 2023లో ఐఆర్‌సీటీసీ తన వినియోగదారులను నకిలీ Android యాప్, వెబ్‌సైట్ గురించి హెచ్చరించింది. దీని ద్వారా స్కామర్‌లు వినియోగదారుల వ్యక్తిగత వివరాలను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఈ నకిలీ ఐఆర్‌సీటీసీ యాప్‌ని ‘irctcconnect.apk’ అని పిలుస్తారు. దీని లింక్ whatsapp – టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌ల ద్వారా షేర్ చేస్తున్నారు. స్కామర్‌లు పంపిన మెసేజ్‌లు – ఇమెయిల్‌లలో, రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి ఇది నిజమైన వెబ్‌సైట్/యాప్ అని పేర్కొంటున్నారు.
పెరుగుతున్న మోసాల కేసుల దృష్ట్యా ఐఆర్‌సీటీసీ తమ వినియోగదారులను అప్రమత్తంగా ఉండమని, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని లేదా అనుమానాస్పద వెబ్‌సైట్‌ను సందర్శించవద్దని కోరింది. ఈ యాప్‌లు – సైట్‌లు నెట్ బ్యాంకింగ్, యూపీఐ, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాల వంటి వినియోగదారుల సున్నితమైన సమాచారాన్ని దొంగిలిస్తాయి.
ఐఆర్‌సీటీసీ పేరుతో చాలా నకిలీ వెబ్‌సైట్‌లు నడుస్తున్నాయి. కేరళలోని 78 ఏళ్ల వృద్ధురాలు తన టిక్కెట్‌ను రద్దు చేసుకునేందుకు నకిలీ ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత అలాంటి మోసానికి గురైంది. దీని తర్వాత, రైల్వే అధికారిగా నటిస్తూ స్కామర్ ఆమెకు ఫోన్ చేసి ‘రెస్ట్ డెస్క్’ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని అడిగాడు. ఆమె యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, దానికి అన్ని యాక్సెస్‌ను అందించిన తర్వాత, ఆమె ఖాతా నుంచి రూ. 4 లక్షలు మాయం అయిపోయాయి.
నకిలీ అప్లికేషన్లు – వెబ్‌సైట్ల ద్వారా మోసాలకు సంబంధించిన కేసులు భారతదేశంలో స్థిరంగా పెరుగుతున్నాయి. సెక్యూరిటీ కంపెనీ గ్రూప్-ఐబి రూపొందించిన డిజిటల్ రిస్క్‌ల ట్రెండ్ 2023 ప్రకారం.. 2022లో భారతదేశంలో స్కామ్ వెబ్‌సైట్ల సంఖ్య వార్షిక ప్రాతిపదికన 304% పెరిగింది. అటువంటి దాడులకు భారతదేశం చాలా హాని కలిగిస్తుందని నివేదిక హైలైట్ చేసింది. నకిలీ సైట్‌లు తమ వెబ్ చిరునామాలలో అక్షరమాలలను తప్పుగా ఉంచుతాయి. వెబ్ చిరునామాలను ఎప్పుడూ క్రాస్ వెరిఫై చేయండి అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాక్టర్ దివ్య తన్వర్ చెబుతున్నారు.
ఒకవేళ మీరు మోసపోయినట్లయితే, వెంటనే మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయండి. బ్యాంకుకు వెళ్లి, ఈ సంఘటన గురించి వారికి తెలియజేయండి. స్థానిక పోలీస్ స్టేషన్‌లో, సైబర్ క్రైమ్ సెల్‌లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కి కాల్ చేసి, స్కామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను అందించండి. అంతేకాకుండా, cybercrime.gov.inకి లాగిన్ చేసి ఫిర్యాదు చేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి చాలా సందర్భాలలో ప్రజలు వెంటనే ఫిర్యాదు చేసిన తర్వాత కూడా డబ్బు అందుకోరు. బాధితుల వద్ద సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే దీనికి కారణం. ఇలాంటి నకిలీ వెబ్సైట్ ల బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తత ఒక్కటే మార్గం. ఎందుకంటే ఈ యాప్ ల ద్వారా కోల్పోయిన డబ్బును మళ్ళీ ట్రాక్ చేయాలంటే చాలా కష్టం. అని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు డాక్టర్ దివ్య తన్వర్ అంటున్నారు.
Alert: It has been reported that a malicious and fake mobile app campaign is in circulation where some fraudsters are sending phishing links at a mass level and insisting users download fake ‘IRCTC Rail Connect’ mobile app to trick common citizens into fraudulent activities.…
— IRCTC (@IRCTCofficial) August 4, 2023
ఇటువంటి యాప్ ల బారిన పడకుండా ఉండటానికి అప్రమత్తంగా ఉండటమే ఏకైక మార్గం అని నిపుణులు చెప్పారు. ఐఆర్‌సీటీసీ అధికారిక యాప్‌ని ‘IRCTC రైల్ కనెక్ట్’ అని పిలుస్తారు. దీనిని Google ప్లే స్టోర్ లేదా Apple Play స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ విశ్వసనీయ యాప్ స్టోర్‌ల నుంచి మాత్రమె ఎప్పుడూ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి. అలాగే, PIN, OTP, పాస్‌వర్డ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వివరాల కోసం ఐఆర్‌సీటీసీ ఎప్పుడూ తన వినియోగదారులకు కాల్ చేయదని, మెయిల్ చేయదని లేదా మెసేజ్ లు పంపదని గుర్తుంచుకోండి. మీరు WhatsApp లేదా సందేశాల ద్వారా అందుకున్న తెలియని లింక్‌పై క్లిక్ చేయవద్దు. ఎలాంటి ఆఫర్లు లేదా డిస్కౌంట్లకు ఆకర్షితులవకండి. మీరు ఈ చిట్కాలను పాటిస్తే, మీరు మోసం నుంచి తప్పించుకోగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి