SBI: 31 పైసలు బకాయి ఉందంటూ నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వని బ్యాంక్.. ఆగ్రహించిన హైకోర్టు..

వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఏం చేయలేని బ్యాంకులు చిన్నపాటి రుణాల(Loans)ను తీసుకున్న వారిని నుంచి మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి...

SBI: 31 పైసలు బకాయి ఉందంటూ నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వని బ్యాంక్.. ఆగ్రహించిన హైకోర్టు..
Money
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 29, 2022 | 7:00 AM

వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారిని ఏం చేయలేని బ్యాంకులు చిన్నపాటి రుణాల(Loans)ను తీసుకున్న వారిని నుంచి మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. ఇలా ఓ రైతు(Farmer) 31 పైసలు చెల్లించలేదని బ్యాంక్‌ నో డ్యూ సర్టిఫికేట్‌(No Due Certificate) ఇవ్వలేదు. దీంతో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన ఎక్కడ జరిగింది.. ఏ బ్యాంక్ ఇలా చేసిందనే వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌ అహ్మదాబాద్‌ దగ్గరలోని ఖోరజ్‌ గ్రామానికి చెందిన శ్యాంజీ భాయ్‌ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని రాకేశ్ వర్మ, మనోజ్‌ వర్మకు అమ్మారు.

అంతకంటే ముందే ఈ భూమిపై శ్యాంజీ భాయ్‌ ఎస్బీఐ బ్యాంక్‌లో రూ.3లక్షల పంట రుణం తీసుకున్నారు. భూమిని అమ్మిన కొద్ది రోజుల తర్వాత శ్యాంజీ తీసుకున్న రుణం మొత్తాన్ని వడ్డీ సహా చెల్లించారు. ఆ తర్వాత కొనుగోలుదారులు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేరును నమోదుచేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ శ్యాంజీ తీసుకున్న రుణానికి సంబంధించి బ్యాంక్‌ నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వకపోవడంతో అది సాధ్యపడలేదు. వారు బ్యాంక్‌కు వెళ్తే సమస్య పరిష్కారం కాకపోవడంతో కొనుగోలుదారులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకు నో డ్యూ పత్రాన్ని ఎందుకు ఇవ్వలేదని కోర్టు ప్రశ్నించింది.

దీనికి ఎస్‌బీఐ తరఫు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పత్రాన్ని సిస్టమ్‌ జనరేట్‌ చేస్తుందని, రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు బకాయి ఉందని. అందుకే నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వడం సాధ్యం కాలేదని ఎస్‌బీఐ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ చట్టం ప్రకారం.. 50 పైసల కంటే తక్కువ ఉన్నదాన్ని లెక్కలోకి తీసుకోరని కోర్టు గుర్తు చేసింది. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా కానీ మీరు సర్టిఫికేట్‌ ఇవ్వలేదని నిలదీసింది. బ్యాంక్‌ మేనేజర్‌ కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది. 31 పైసలు చెల్లించనందుకు నో డ్యూ సర్టిఫికేట్‌ ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Read Also.. Vijaya Gadde: తెలుగు మహిళను టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్.. ట్విట్టర్ ని కొన్న వెంటనే ఎందుకిలా చేస్తున్నాడంటే..