SBI Zero Balance Account Holders: జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్స్‌పై ఎస్బీఐ వడ్డింపు మామూలుగా లేదు.. అకౌంట్ హోల్డర్స్‌కి అందించే సేవలపై అధిక చార్జీలను వసూలు చేస్తుంది. ఐఐటి-బొంబాయి అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ లెక్క ప్రకారం.. 2015-20 మధ్య కాలంలో ఎస్బీఐ దాదాపు 12 కోట్ల బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్(బీఎస్‌బిడిఎ) హోల్డర్ల నుంచి రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలో పేర్కొంది. జీరో బ్యాలెన్స్ ఖాతాదారులు నాలుగు లావాదేవీల కంటే ఎక్కువగా చేస్తే ప్రతీ లావాదేవీకి రూ.17.70 వసూలు చేసినట్లు తెలిసింది.
అయితే ఎస్బీఐ మాత్రమే కాదు ఇందులోకి పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా చేరింది. ఈ బ్యాంకు 3.9 కోట్ల బీఎస్‌బిడిఎ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు వసూలు చేసింది. ఇలా చాలా బ్యాంకులు జీరో బ్యాలెన్స్ లేదా బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై గల ఆర్బీఐ నిబంధనలు తుంగలోకి తొక్కుతున్నాయి. ఇష్టారీతిన చార్జీలను వసూలు చేస్తున్నట్లు ఐఐటి-బొంబాయి అధ్యయనంలో తేలింది. 2013 సెప్టెంబర్ ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. బీఎస్‌బీడిఎపై ఛార్జీలు వసూలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్బీఐ గరిష్ట సంఖ్యలో బీఎస్‌బిడిఎలను నిర్వహిస్తుంది. ప్రతి డెబిట్ లావాదేవీపై (డిజిటల్ మార్గాల ద్వారా కూడా) నెలకు నాలుగు దాటిన ప్రతిసారి 17.70 రూపాయలు వసూలు చేస్తుంది. 2018-19 కాలంలో రూ.72 కోట్ల వసూలు చేస్తే 2019-20 రూ.158 కోట్లు వసులు చేసినట్లు” ఐఐటి బొంబాయి ప్రొఫెసర్ ఆశిష్ దాస్ అధ్యయనం పేర్కొంది.
ఒకవైపు కేంద్రం డిజిటల్ చెల్లింపులను పెంచాలని చూస్తుంటే.. ఎస్బీఐ మాత్రం ఖాతాదారులను నిరుత్సాహపరుస్తుంది. ఆర్బీఐ.. బ్యాంకులపై నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు. కచ్చితంగా ఆజమాయిషీ ఉండాలని చెబుతున్నారు. లేదంటే బ్యాంకులు ఇష్టారీతిన ఛార్జీలు వసూలు చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ పౌరులు తీసుకునే జీరో బ్యాలెన్స్ అకౌంట్లపై ఇంత పెద్దమొత్తంలో ఛార్జీలు వసూలు చేయడం తగదన్నారు. దేశంలో ప్రతి ఒక్కరికి ఖాతా ఉండాలని చెప్పేది ఇందుకోసమేనా అని ప్రశ్నిస్తున్నారు? వీటిపై నిరసనలు వెల్లువెత్తకముందే ఆర్బీఐ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.