Finance Tips: జీతం రాగానే అకౌంట్ ఖాళీ అవుతుందా..? ఈ టిప్స్ పాటిస్తే మీ డబ్బులు ఆదా..
జీతం రాగానే వారం రోజుల్లో అకౌంట్ ఖాళీ అయిపోతూ ఉంటుంది. దీంతో నెలవారీ ఖర్చు కోసం ఇతరులను అప్పు అడగడం లేదా రుణాలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఖర్చులను తగ్గించుకుని డబ్బులు పొదపు చేసుకోవచ్చు.

ఉద్యోగాలు చేసేవారు ఎదుర్కొనే అది పెద్ద సమస్య ఏంటంటే.. జీతం పడిన వారం రోజుల్లోనే మొత్తం ఖర్చు అయిపోతుంది. ఈఎంఐలు, ఇంటి ఖర్చులకు పోను మిగిలేది ఏం ఉండదు. దీంతో తర్వాతి నెల జీతం ఎప్పుడు వస్తుందా అని మళ్లీ ఎదురుచూపులు తప్పవు. మధ్యలో డబ్బులు అవసరమైతే అప్పులు చేయాల్సిందే. ఉద్యోగాలు చేసేవారిలో మెజార్టీ మంది నెలవారీ ఖర్చులకు డబ్బులు సరిపోక సతమతమవుతుంటారు. అయితే దీనిని దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకపోవడమేనని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ప్రణాళిక లేకుండా ఎలా పడితే అలా ఖర్చులు పెట్టడం, అధిక రుణాలు తీసుకోవడమే కారణమని చెబుతున్నారు. దీని నుంచి బయటపడటానికి పలు సూచనలు కూడా చెబుతున్నారు. అవేంటి అనేది ఇందులో చూద్దాం.
ఈ తప్పు చేయకండి
క్విక్ ఈ-కామర్స్ యాప్‌ల రాకపోతే ఫుడ్, బట్టలు, నిత్యావసర సరుకులు లాంటివి 10 నిమిషాల్లోనే మనం ఉన్న చోటికే వచ్చేస్తున్నాయి. దీని కారణంగా అవసరం లేని వస్తువులను కూడా చాలామంది ఆర్డర్ చేస్తుంటారు. దీని వల్ల ఖర్చు అనేది పెరిగిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఖర్చులే మీ జీతంలో అధిక భాగాన్ని తినేస్తున్నాయి. దీని నుంచి బయటపడాలంటే.. ప్రతి వారం ఆహారం, పానీయాలు, బయట తినడానికి ఒక బడ్జెట్‌ను పెట్టుకోండి. ఇంటి నుండి భోజనం తీసుకెళ్లి బయట తినడం తగ్గించండి. ఒక నెలకు సరిపడా కిరాణా సామాన్లను ఒకేసారి కొనుగోలు చేయండి.
ఓటీటీల వాడకం
ఇక ఓటీసీ ఫ్లాట్‌ఫామ్స్, మ్యూజిక్ యాప్‌లు, ఫుడ్ డెలివరీ, ఇతర డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు వంటి వాటిని తగ్గించుకోవాలి. కొంతమంది వాడకపోయినా అన్నీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లు తీసుకుంటారు. అందుకే అవసరమైన వాటిని మాత్రమే తీసుకోండి. డిజిటల్ యాప్‌లపై ఎక్కవ ఖర్చు చేయకపోవడమే మంచిది. ఆటో పేమెంట్స్‌ను క్రమక్రమంగా తగ్గించుకునే ప్రయత్నం చేయండి.
బడ్జెట్ ముఖ్యం
నెలకు ఎంత ఖర్చు అవుతుందనే బడ్జెట్ ముందుగానే ప్రిపేర్ చేసుకోండి. ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, నిత్యావసర సరుకులు, ఇతర ఖర్చులకు ఎంత సొమ్ము కావాలనేది ముందుగా లెక్కించండి. దానికి అనుగుణంగా ఖర్చు పెట్టండి. బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం వల్ల జీతం డబ్బులు త్వరగా ఖాళీ అవుతాయి.
ఈఎంఐ భారం తగ్గించుకోవడం
క్రెడిట్ కార్డు బిల్లు, ఈఎంఐలు ఉన్నట్లయితే ముందుగా అధిక వడ్డీ ఉన్న దానిని క్లియర్ చేయండి. అధిక వడ్డీ వల్ల మీ ఆదాయం దానికే సరిపోతుంది. అందుకే అధిక వడ్డీ ఉన్న రుణాలను త్వరగా చెల్లించండి. ఇక రోజువారీ అవసరాలకు క్రెడిట్ కార్డులను వాడటం మానేయండి. క్యాష్ , డెబిట్ కార్డ్ చెల్లింపుల ద్వారా ఖర్చులను నియంత్రించుకోండి.
