
భారతదేశంలోని తల్లిదండ్రులు తమ ఆడపిల్ల కోసం భవిష్యత్ విషయంలో ఓ రకమైన ఆందోళన చెందుతూ ఉంటారు. వారికి విద్యాబుద్ధులు నేర్పించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలని కోరకుంటూ ఉంటారు. అలాగే తమ కుమార్తె వివాహాన్ని కూడా ఒక ముఖ్యమైన బాధ్యతగా భావిస్తారు. అయితే రెండు ప్రయోజనాల కోసం ఒక పెద్ద మొత్తంలో సొమ్ము అవసరం. కాబట్టి ఆడపిల్ల పుట్టిన సమయం నుంచి పెట్టుబడిని చ్చితంగా ప్లాన్ చేస్తే మీరు ఈ మొత్తాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రతి నెలా చిన్న, క్రమబద్ధమైన పెట్టుబడి దీర్ఘకాలంలో పెద్ద మొత్తాన్ని కూడబెట్టడంలో మీకు సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారి కోసం సుకన్య సమృద్ధి యోజన పొదుపు పథకం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఈ పథకంలో రూ. 12,500 నెలవారీ పెట్టుబడి మీరు మెచ్యూరిటీ సమయంలో రూ. 70 లక్షల నిధిని సేకరించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ ఫండ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని పోస్టాఫీసుతో పాటు బ్యాంకులు నిర్వహిస్తాయి. సుకన్య సమృద్ధి యోజన అనేది ఆడపిల్లల విద్య, వివాహానికి ఉద్దేశించిన చిన్న పొదుపు పథకం. పోస్ట్ ఆఫీస్ ఎస్‌ఎస్‌వై స్కీమ్ 8.2 శాతం వడ్డీ రేటును ప్రతి సంవత్సరం లెక్కించి సమ్మేళనం చేస్తుంది. పది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్ల పేరు మీద ఒక సంరక్షకుడు ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ. 250 పెట్టుబడితో ఎస్‌ఎస్‌వై ఖాతాను తెరవవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ట డిపాజిట్ పరిమితి రూ. 1.50 లక్షలుగా ఉంటుంది. ఒక నెలలో లేదా ఆర్థిక సంవత్సరంలో ఎన్ని డిపాజిట్లు అయినా చేయవచ్చు. పథకం కోసం లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలుగా ఉంటుంది. 15 ఏళ్లు పూర్తయిన తర్వాత, ఆడపిల్లకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత డబ్బు తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 సంవత్సరాల తర్వాత లేదా 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆడపిల్ల పెళ్లి సమయంలో మూసివేయవచ్చు.
ఈ నేపథ్యంలో మీరు మీ ఆడపిల్ల కోసం రూ. 70 లక్షల ఫండ్‌ని లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే, మీరు నెలకు రూ. 12,500 లేదా ఆర్థిక సంవత్సరంలో రూ. 1,50,000 పెట్టుబడి పెట్టాలి. 15 సంవత్సరాలలో, మీ మొత్తం పెట్టుబడి రూ. 22,50,000 అవుతుంది. 8.20 శాతం వడ్డీ రేటుతో, మీరు 46,77,578 రాబడిని పొందుతారు. అంటే మెచ్యూరిటీ సమయంలో మీరు మొత్తం రూ. 69,27,578 లేదా దాదాపు రూ. 70 లక్షలు పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..