Crypto Crimes: క్రిప్టో కరెన్సీ దొంగలొచ్చారు.. కాయిన్లను మాయం చేసేస్తున్నారు.. జాగ్రత్త మరి..
Crypto Crimes: ఇంట్లో దొంగలు పడి బంగారం, డబ్బు దోచుకెళ్లడం సాధారణమే. కానీ.. ఆధునికత పెరుగుతున్న ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి ప్రజల బ్యాంక్ ఖాతాల(Bank Account) నుంచి డబ్బు కొట్టేస్తున్నారు.
Crypto Crimes: ఇంట్లో దొంగలు పడి బంగారం, డబ్బు దోచుకెళ్లడం సాధారణమే. కానీ.. ఆధునికత పెరుగుతున్న ఈ సమయంలో సైబర్ నేరగాళ్లు మాయమాటలు చెప్పి ప్రజల బ్యాంక్ ఖాతాల(Bank Account) నుంచి డబ్బు కొట్టేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ ట్రెండ్ కొనసాగుతోంది. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నాయి. కానీ ఈ మధ్య కాలంలో నేరగాళ్ల కన్ను క్రిప్టో కరెన్సీలపై పడింది. బిట్‌కాయిన్, ఎథేరియమ్ వంటి క్రిప్టో కరెన్సీలను కూడా సైబర్ కేటుగాళ్లు(Cyber Thief) దొంగిలిస్తున్నారని నార్టన్ ల్యాబ్స్‌కు చెందిన పరిశోధన సేవల సంస్థ నార్టన్ లైఫ్ లాక్ ఇటీవల వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో నార్టన్ ల్యాబ్స్ తన సాఫ్ట్‌వేర్ టూల్స్ ఉపయోగించి రోజుకు 1.95 కోట్ల సైబర్ మోసగాళ్ల దాడులను నిరోధించినట్లు వెల్లడించింది. వీటిలో దాదాపు 60,000 ఫిషింగ్ ప్రయత్నాలు, 31,062 సాంకేతికత ఆధారిత మోసాలు ఉన్నట్లు వెల్లడించింది. వినియోగదార్లను మోసం చేయడానికి, తప్పుడు సమాచారాన్ని ప్రచారంలోకి తీసుకు రావడానికి ‘డీప్‌ఫేక్స్’ ను వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి అబద్ధాలను నిజంగా నమ్మించేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్న విషయం బయటపడింది.
గడచిన ఏడాదిలో సుమారు రూ.220 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ దొంగతనాలు చోటుచేసుకున్నట్లు నార్టన్ ల్యాబ్స్ తెలిపింది. ఈ సంఖ్య ఈ ఏడాది మరింత పెరుగుతుందని సదరు సంస్థ అంచనా వేస్తోంది. ఉక్రెయిన్‌లో మానవతాసాయం చేస్తామంటూ క్రిప్టో ఇన్వెస్టర్ల నుంచి చందాలు అడగడంతో పాటు, పలు రకాల పద్ధతుల్లో క్రిప్టో కాయిన్లను దొంగిలించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే.. దొంగతనానికి గురైన క్రిప్టో కరెన్సీలు ఎక్కడికి పోతున్నాయనే విషయం తెలుసుకోవటం కష్టం. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడే వారు తాము ఎంతో విశ్వసనీయ వ్యక్తులుగా నమ్మిస్తూ.. తమ పనులు చక్కబెట్టుకుంటున్నారని నార్టన్ లైఫ్ లాక్ టెక్నాలజీ హెడ్ డారెన్ షౌ పేర్కొన్నారు. అందువల్ల ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు, ఈ-మెయిల్ ద్వారా నిర్వహించే లావాదేవీల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వివరించారు. సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ ఒక అడుగు ముందుగా ఉంటూ.. మోసాలకు పాల్పడేందుకు ఎప్పుడూ కొత్త మార్గాలను అన్వేషిస్తూనే ఉంటారు. ఏదేమైనా ఇలాంటి మాయగాళ్లకు దూరంగా ఉండేందుకు ఇలాంటి మోసాల గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం.
ఇవీ చదవండి..
IPO News: 60% పతనమైన Nykaa, Paytm, Zomato విలువ.. ఇన్వెస్టర్ల భవిష్యత్తు బంగారమేనట ఎందుకంటే..!