ఈ సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ తన రిటైల్, టెలికాం వ్యాపారాన్ని ఆయిల్-టు-కెమికల్ వ్యాపారం నుంచి వేరుచేసే అవకాశం ఉంది. దీని కోసం రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో IPO తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. JP మోర్గాన్ నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సంవత్సరం వార్షిక సాధారణ సమావేశంలో టెలికాం, రిటైల్‌తో సహా తన వినియోగదారుల వ్యాపారం కోసం IPOను ప్రకటించవచ్చు. గత మూడు AGM సమావేశాలలో దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈసారి AGM సమావేశంలో దీని గురించి ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం జూలై చివర్లో లేదా ఆగస్టు మొదట్లో జరగనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క డీ-మెర్జర్, IPO ఈ సంవత్సరం వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించవచ్చని కొన్ని మీడియా నివేదికలు కూడా పేర్కొన్నాయి. కొన్ని మీడియా నివేదికలలో ముఖేష్ అంబానీ జియో, రిటైల్ వ్యాపారం కోసం ప్రత్యేక IPOలను ప్రకటిస్తారని పేర్కొన్నాయి.
వినియోగదారుల వ్యాపారం పనితీరు నిరంతరం మెరుగుపడుతోందని JP మోర్గాన్ పేర్కొంది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (APRU) కారణంగా రిలయన్స్ జియో లాభం పెరుగుతోంది. దీంతో పాటు రిటైల్ మార్కెట్‌లోనూ రిలయన్స్ పట్టు మరింత బలపడుతోంది. రిటైల్ మార్కెట్‌లో ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది. 2019 వార్షిక సర్వసభ్య సమావేశంలో కంపెనీ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వచ్చే ఐదేళ్లలో రిటైల్, టెలికాం వ్యాపారాన్ని వేరు చేస్తామని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్, టెలికాం వ్యాపారం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి వేల కోట్ల నిధులను సేకరించింది. గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ప్రకారం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ ఆదాయం 45 శాతం పెరిగింది.
రిలయన్స్ రిటైల్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ మార్కెట్ రెండింటిలోనూ తన పట్టును బలోపేతం చేస్తోంది. రిలయన్స్ ఇ-కామర్స్ ఆదాయం FY22లో కేవలం $3 బిలియన్ల నుంచి FY2024-25 నాటికి $14 బిలియన్లకు పెరుగుతుందని గోల్డ్‌మన్ అంచనా వేసింది. మొత్తం ప్రధాన రిటైల్ ఆదాయం 37 శాతం CAGRతో FY2025 నాటికి $38 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా.