అప్పుల్లో కూరుకుపోయిన ల్యాంకో అమర్‌కంటక్ పవర్ అమ్మకానికి సిద్ధమైంది. దీనిని వేలం పాటలో దక్కించుకునేందుకు రెండు ప్రధాన దిగ్గజ కంపెనీలు పోటీ పడనున్నాయి. దేశంలోని ఇద్దరు ధనవంతులైన గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ముఖాముఖి పోటీలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) కూడా REC లిమిటెడ్ భాగస్వామ్యంతో వేలంలో నిలబడింది. ప్రస్తుతం.. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ బొగ్గు ఆధారిత పవర్ ప్రాజెక్ట్ కొనుగోలు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం కంపెనీ ముందస్తుగా ఆఫర్ చేసింది. రిలయన్స్ ఈ బిడ్‌ను గెలిస్తే, దీని ద్వారా కంపెనీ తొలిసారిగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలోకి ప్రవేశిస్తుంది. నవంబర్ 25న జరగనున్న వేలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అదానీ పవర్ తలపడనున్నాయి. దేశంలోని రెండు అతిపెద్ద కార్పొరేట్ సంస్థలు ఒకరిపై ఒకరు నేరుగా పోటీపడటం ఇదే తొలిసారి. పవర్ ఫైనాన్స్ కార్ప్, రిలయన్స్ లిమిటెడ్ కన్సార్టియం కూడా ఈ బిడ్ ప్రక్రియలో పాల్గొంటుంది.
ఈ బిడ్‌ను ఆర్‌ఐఎల్ దక్కించుకుంటే కంపెనీ తొలిసారిగా థర్మల్ పవర్ రంగంలోకి ప్రవేశిస్తుంది. రిజల్యూషన్ ప్లాన్ సమర్పణలో మొదటి రౌండ్‌లో ఆర్‌ఐఎల్ అత్యధిక బిడ్డర్‌గా నిలవగా, రెండో రౌండ్‌లో అదానీ పవర్ అగ్రస్థానంలో ఉందని మీడియా నివేదికలో నిపుణులు తెలిపారు. పీఎఫ్‌సీ-ఆర్‌ఈసీ కన్సార్టియం రెండు రౌండ్లలో మూడవ స్థానంలో ఉంది.
రెండో రౌండ్‌లో అదానీ రూ.2,950 కోట్లను బిడ్ చేసింది. అందులో రూ.1,800 కోట్లు అడ్వాన్స్ పేమెంట్, మిగిలిన రూ.1,150 కోట్లు ఐదేళ్లలో ఇవ్వనున్నారు. రిలయన్స్ రూ. 2,000 కోట్లు ముందస్తు చెల్లింపు ప్రణాళికను రూపొందించింది. అయితే పీఎఫ్‌సీ 10-12 సంవత్సరాలలో రూ. 3,870 కోట్లు చెల్లించడానికి ఆఫర్ చేసింది. నవంబర్ 25న నిర్వహించనున్న వేలానికి అత్యధిక ధర పలికిన అదానీ పవర్ ఆఫర్ చేసిన రూ.2,950 కోట్లు బేస్ ధర. ఐదు రోజుల పాటు జరిగిన 51వ కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ సమావేశంలో వేలం పాటను నిర్వహించాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్, అదానీ, పీఎఫ్‌సీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
వేదాంత లిమిటెడ్ బైండింగ్ బిడ్‌ను రుణదాతలు తిరస్కరించిన వెంటనే లాంకో అమర్‌కంటక్ ఆర్‌పి పవర్ కంపెనీ విక్రయ ప్రక్రియను జనవరిలో పునఃప్రారంభించింది. అనిల్ అగర్వాల్ ప్రమోట్ చేసిన కంపెనీ రుణదాతలకు దాదాపు రూ.3,000 కోట్లను ఆఫర్ చేసింది. ఇందులో రూ. 2,150 కోట్ల విలువైన బాండ్లను ఏడేళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ల్యాంకో అమర్‌కంటక్ బ్యాలెన్స్ షీట్‌లోని నగదు నుండి పాక్షిక చెల్లింపు, కొన్ని ముందస్తు చెల్లింపులు ఉన్నాయి.
ల్యాంకో ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా-చంపా రాష్ట్ర రహదారిపై బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. ఇది మధ్యప్రదేశ్, హర్యానా, సొంత రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసే ఒక్కొక్కటి 300 మెగావాట్ల రెండు యూనిట్లతో కూడిన మొదటి దశను ప్రారంభించింది. 660 మెగావాట్ల మరో రెండు యూనిట్లతో కూడిన రెండో దశ నిర్మాణంలో ఉంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. 660 మెగావాట్ల రెండు యూనిట్లతో కూడిన మూడవ దశ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి