Bank Accounts: పదేళ్లు దాటితే చాలు.. సొంతంగా నిర్వహించుకోవచ్చు.. ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతాలు తప్పనిసరి అయిపోయాయి. ప్రతి ఒక్కరూ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల పేరు మీద కూడా ఖాతాలు ప్రారంభిస్తారు. అయితే వారు మైనర్లు అయితే సొంతంగా ఖాతా తీసుకోవడానికి బ్యాంకు నిబంధనలు ఒప్పుకోవు. దీంతో 18 ఏళ్లు నిండే వరకూ గార్డియన్ గా తల్లి గానీ తండ్రి గానీ ఉండి ఆ అకౌంట్ ను నిర్వహిస్తారు. అయితే ఈ నిబంధనను ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది.

పదేళ్ల వయసున్న పిల్లలకు సొంతంగా ఖాతాలు ప్రారంభించుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. పదేళ్ల పైన వయసున్న మైనర్లు సాధారణ పొదుపు లేదా ఫిక్స్ డ్ డిపాజిట్ ఖాతాలను స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు వెసులుబాటు నిచ్చింది. జూలై ఒకటో తేదీ నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలని బ్యాంకులకు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకూ ఉన్న తల్లిదండ్రులు మాత్రమే మైనర్ల ఖాతాలను నిర్వహించే నిబంధన మారిపోనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుత నిబంధనలు ఇవి..
సాధారణంగా 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్లు బ్యాంకు ఖాతాలు కలిగి ఉండొచ్చు. కానీ వారికి లీగల్ గార్డియన్ గా ఎవరో ఒకరు ఉండాలి. వారి ద్వారానే ఖాతాలు నిర్వహించాలి. తల్లి లేదా తండ్రి ఎవరైనా గార్డియన్ గా ఉండి ఖాతా నిర్వహించవచ్చు. అయితే ఇప్పుడు ఆర్బీఐ తాజాగా ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పదేళ్లు వయసు దాటిన మైనర్లు వారి సొంతంగానే బ్యాంకు ఖాతాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంది.
కొత్త నిబంధనలు ఇవి..
ఆర్బీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని దృష్టిలో ఉంచుకొని సొంత నిబంధనలు ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఆ మేరకు పదేళ్లు దాటిన మైనర్లకు పొదుపు ఖాతాలకు పరిమితి విధించుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలు విధించినా ఖాతాదారుడికి ముందే తెలియజేయాల్సి ఉంటుంది. మైనర్లు మేజర్ అయ్యే వరకూ వారి నమూనా సంతకాన్ని బ్యాంకు రికార్డుల్లో భద్ర పరుస్తారు.
సదుపాయాలు ఇవి..
పదేళ్లు దాటిన మైనర్ ఖాతాదారులకు బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్ బుక్ వంటి సదుపాయాలు బ్యాంకులు ఉచితంగా అందించే అవకాశం ఉంది. అయితే దీనిలో అతిగా విత్ డ్రా చేయకుండా, దానిలో ఎప్పుడూ డబ్బులు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ఏడాది జూలై 1 నాటికి ఈ కొత్త మర్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విధానాలను రూపొందించాలని ఆర్బీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








