
దేశంలో దాదాపు ప్రతీఒక్కరికీ ఏదోక బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆర్ధిక లావాదేవీలు సులువుగా చేసేందుకు బ్యాంక్ అకౌంట్ అనేది అవసరం. వేర్వేరు అవసరాల కోసం ఎక్కువమంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తూ ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికి సేవింగ్స్ అకౌంట్‌తో పాటు ప్రత్యేకంగా శాలరీ అకౌంట్ కూడా ఉంటుంది. కొంతమంది రోజువారీ ఖర్చుల కోసం ఒక అకౌంట్, పొదుపు కోసం మరో అకౌంట్, పెట్టుబడుల కోసం మరో అకౌంట్ వాడుతూ ఉంటారు. కానీ ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు వాడితే ఫైన్ పడుతుందా..? త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్ తీసుకురాబోతుందా..? ఈ ప్రచారంలో నిజమెంత? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఆర్బీఐ రూ.10 వేల జరిమానా విధిస్తుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా ఈ మేరకు పోస్టర్లు వైరల్ అవుతున్నాయి. కానీ దీనికి సంబంధించి ఆర్బీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆర్బీఐ త్వరలో నిర్ణయం తీసుకోనుందనే వార్తలు వస్తుండగా.. దీనిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్టకేలకు స్పందించింది. సోషల్ మీడియాలో జరిగే ప్రచారం అవాస్తవమని, ఎలాంటి జరిమానాలు విధించబోమని తెలిపింది. ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉండాలనేది వారి ఇష్టమని, అవసరాలకు తగ్గట్లు ఓ వ్యక్తి ఎన్ని అకౌంట్లు అయినా వినియోగించవచ్చని స్పష్టం చేసింది. ఇందుకు ఎలాంటి ఫైన్ ఉండదని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఎలాంటి జరిమానా విధించబోమని పేర్కొంది.
అయితే డిజిటల్ విధానంలో నెట్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ విధానం ద్వారా ఎక్కువమంది పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో సైబర్ నేరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆర్బీఐ కొత్త నిబంధన తీసుకురానుంది. కొత్త వ్యక్తి అకౌంట్‌కు రూ.10 వేల కంటే ఎక్కువ నగదు పంపితే గంట పాటు హోల్డ్‌లో ఉంటుంది. ఆ తర్వాతే రిసీవర్ అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. గంటలోపు కావాలంటే పంపిన వ్యక్తి ట్రాన్సాక్షన్ రద్దు చేయవచ్చు. సైబర్ నేరాలను అరికట్టేందుకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుందని ఆర్బీఐ చెబుతోంది. అయితే కొంతమంది దీనిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే రూ.10 వేల జరిమానా విధిస్తారంటూ కొంతమంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కానీ ఆర్బీఐ దగ్గర అలాంటి ఆలోచన ఏమీ లేదని తెలుస్తోంది.