AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Lessons: పిల్లలకు నేర్పుదాం ఆర్థిక పాఠాలు..! ఈ స్మార్ట్ టిప్స్ మస్ట్‌గా చెప్పాలి..

Financial Literacy: పిల్లలకు చిన్నప్పుడే డబ్బు విలువ, పొదుపు, బాధ్యతాయుతగా ఖర్చు వంటి ఆర్థిక పాఠాలు నేర్పించడం ఎంతో అవసరం. తల్లిదండ్రుల ప్రవర్తన, ఇంట్లో జరిగే ఆర్థిక చర్చలు పిల్లల భవిష్యత్తు డబ్బు అలవాట్లపై కీలక ప్రభావం చూపుతాయి. చిన్న చిన్న ఆచరణాత్మక పాఠాల ద్వారా పిల్లలను ఆర్థికంగా స్వతంత్రులుగా తీర్చిదిద్దవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందుల గురించి పిల్లలకు వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

Money Lessons: పిల్లలకు నేర్పుదాం ఆర్థిక పాఠాలు..! ఈ స్మార్ట్ టిప్స్ మస్ట్‌గా చెప్పాలి..
Money LessonsImage Credit source: Magnific
Janardhan Veluru
|

Updated on: May 22, 2026 | 4:23 PM

Share

ఈరోజుల్లో పిల్లలకు చదువుతో పాటు ఆర్థిక అంశాల మీద అవగాహన కూడా ఎంతో అవసరం. డబ్బు ఎలా సంపాదించాలి? ఎలా ఖర్చు పెట్టాలి? ఎలా పొదుపు చేయాలి? వంటి విషయాలను చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అప్పుడే వారు భవిష్యత్తులో ఆర్థిక విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా ఎదుగుతారు. ముఖ్యంగా ఈ విషయంలో తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు మొదటి పాఠ్యపుస్తకం అవుతుంది. అందుకే ప్రతి ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక పాఠాలు పిల్లలకు అలవాటు చేయడం చాలా ముఖ్యం.

1. ఆర్థిక పాఠాలు..త్వరగా ప్రారంభించండి

పిల్లలు చిన్న వయస్సులోనే డబ్బు విలువ అర్థమయ్యేలా చెప్పాలి. ఖర్చు, పొదుపు, అవసరం-ఆడంబరం మధ్య తేడా వంటి విషయాలను తల్లిదండ్రులు సాధారణ ఉదాహరణలతో చెప్పాలి. చిన్నప్పటి నుంచే డబ్బు పొదుపు చేయడం అలవాటు చేయాలి. అప్పుడే వారు డబ్బును జాగ్రత్తగా వినియోగించడం నేర్చుకుంటారు.

2. మాటల్లో కాదు చేతల్లో చూపండి..

మనం చెప్పే మాటల కంటే మనం చేసే పనులను పిల్లలు ఎక్కువగా గమనిస్తారు. తల్లిదండ్రులు మంచినీళ్ల ప్రాయంగా అవసరంలేని ఖర్చులు చేస్తే లేదా అప్పుల మీద జీవిస్తే పిల్లలు కూడా అదే అలవాట్లను అలవరుచుకునే అవకాశం ఉంటుంది. అలాగే దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం, ముందుగా ప్లాన్ చేసుకోవడం, పొదుపు చేయడం వంటి మంచి అలవాట్లు పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతాయి. ఆర్థిక క్రమశిక్షణకున్న పవర్ ఏంటో వారికి అర్థమయ్యేలా చేతల్లో చూపించాలి.

3. ఆర్థిక నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయండి

కుటుంబ ఖర్చులతో పాటు ఇంట్లో నిర్వహించే చిన్న చిన్న ఈవెంట్ల బడ్జెట్ ప్లానింగ్ వంటి విషయాల్లో పిల్లలను కూడా చేర్చడం మంచిది. ఉదాహరణకు పుట్టినరోజు వేడుకకు ఎంత ఖర్చు చేయాలి? ఏవి అవసరం? ఏవి తగ్గించవచ్చు? వంటి విషయాలను వారితో చర్చించండి. ఇలా చేయడం వల్ల డబ్బును వృధా చేయకూడదని.. దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలనే అవగాహన వారికి వస్తుంది.

4. మీ ఇళ్లే మొదటి ఆర్థిక పాఠశాల..

ఆర్థిక విషయ పరిజ్ఞానం పాఠశాల పుస్తకాలతో మాత్రమే రాదు. ఇంట్లోనే పిల్లలు నేర్చుకుంటారు. ఖర్చుల వివరాలను రాసిపెట్టుకోవడం.. సరైన నెలవారీ బడ్జెట్ అంశాల గురించి పిల్లలతో తప్పనిసరిగా చర్చించాలి. పొదుపు ఎందుకు చేయాలి? పొదుపు చేయకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఆర్థిక కష్టాలు? ఒక అవసరం కోసం మరొక కోరికను ఎలా వదులుకోవాలి? వంటి విషయాలను కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటే పిల్లల్లో బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పిల్లల అభిప్రాయాలను కూడా తీసుకుంటే.. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

5. చివరి లక్ష్యం ఆర్థిక స్వాతంత్ర్యం

చిన్నప్పటి నుంచే సరైన ఆర్థిక అలవాట్లు నేర్చుకున్న పిల్లలు.. పెద్దయ్యాక మనీ విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారు అప్పుల బారిన పడకుండా, స్పష్టమైన లక్ష్యాలతో జీవించగలుగుతారు. దుబారా ఖర్చులకు దూరంగా పొదుపుపై దృష్టి పెట్టగలరు. ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కరోజులో రాదు. అది చిన్న చిన్న అలవాట్లతో ప్రారంభమవుతుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు గురించి నిజాయితీగా, ఆచరణాత్మకంగా చెప్పడం చాలా అవసరం.

పిల్లలకు ఆర్థిక పాఠాలు నేర్పడం అనేది కేవలం డబ్బు గురించి చెప్పడం మాత్రమే కాదు.. బాధ్యత, ఆర్థిక ప్రణాళిక, స్వీయ నియంత్రణ వంటి విలువలను కూడా నేర్పించడం. చిన్న వయస్సులోనే సరైన ఆర్థిక అవగాహన కలిగిస్తే, వారు భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరమైన, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు.

Follow Us