86 వసంతాల వయసులోనూ ముఖంలో చెరగని చిరునవ్వుతో భారత పారిశ్రామిక రంగంలో తనదైన ముద్రవేశారు రతన్ టాటా. అనారోగ్య కారణాలతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో అక్టోబర్ 9 రాత్రి 11 గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. రతన్ టాటా తండ్రి పేరు నావల్ టాటా. అయితే నావల్ టాటా కంటే ముందు అతని పూర్వికులు ఎవరికీ ‘టాటా’ అనే ఇంటిపేరు లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. నావల్ టాటాకు 13 ఏళ్ల వయసున్నప్పుడు అనాథాశ్రమంలో చదువుతున్న సమయంలో అతని పేరు వెనుక ‘టాటా’ చేరింది. అదెలా జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం..
టాటా సన్స్ గ్రూప్ ఏవియేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ అయిన నావల్ టాటాకు డిసెంబర్ 28, 1937న రతన్ టాటా జన్మించారు. నావల్ టాటా పుట్టిన రెండు సంవత్సరాలకే టాటా మిల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. నావల్ టాటా పుట్టిన సమయంలో, ఆయన తండ్రి హోర్ముస్జీ అహ్మదాబాద్‌లోని టాటా గ్రూప్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ మిల్స్‌లో స్పిన్నింగ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. కానీ అతను కేవలం ఓ ఉద్యోగి మాత్రమే.. అతనికి ‘టాటా’ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. అతని జీవితంలో U టర్న్ 1917లో వచ్చింది. రతన్ టాటా తండ్రి నావల్ టాటా లైఫ్‌లోకి తొంగిచూస్తే..
నావల్ టాటా 1904 ఆగస్టు 30న హార్ముస్జీ కుటుంబంలో జన్మించారు. ఆయన కుటుంబం ముంబైలో (అప్పటి బొంబాయి) నివసించింది. నావల్ టాటాకు 4 సంవత్సరాల వయస్సున్నప్పుడు, అతని తండ్రి హోర్ముస్జీ 1908లో మరణించారు. అతని మరణం తరువాత, కుటుంబం అకస్మాత్తుగా ఆర్థిక సంక్షోభానికి గురైంది. దీంతో నావల్, అతని తల్లి ముంబై నుంచి గుజరాత్‌లోని నవ్‌సారికి వలస వచ్చారు. ఇక్కడ బలమైన ఉపాధి వనరులు ఏమీ లేవు. నావెల్ తల్లి బట్టల ఎంబ్రాయిడరీలో సొంతంగా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ పని ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించేది. నావల్ వయస్సు పెరిగేకొద్ది, అతని భవిష్యత్తు గురించి తల్లి ఆందోళన చెందింది.
అతని కుటుంబం గురించి తెలిసిన వారు నావల్‌ను చదివించడానికి JN పెటిట్ పార్సీ అనాథాశ్రమానికి పంపారు. అక్కడే నావెల్ ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసాడు. అతనికి 13 యేళ్ల వయస్సులో 1917లో, ప్రసిద్ధ పార్సీ పారిశ్రామికవేత్త మరియు ప్రజా సేవకుడు జమ్‌సెట్‌జీ నసర్వాన్‌జీ టాటా కుమారుడు సర్ రతన్ టాటా, ఆయన భార్య నవాజ్‌బాయి పెటిట్ పార్సీ అనాథాశ్రమానికి వచ్చారు. అక్కడ నావల్‌ని చూసిన నవాజ్‌బాయికి నావల్ తెగ నచ్చేశాడు. అంతే వెంటనే తన కొడుకుగా దత్తత తీసుకుంది. ఆ తర్వాత ‘నవల్’ టాటా కుటుంబంలో భాగస్వామ్యం అయిపోయి ‘నవల్ టాటా’గా అయ్యాడు.
టాటా కుటుంబంలో చేరిన తర్వాత నావల్ టాటా అదృష్టం మారడం ప్రారంభమైంది. నావల్ చిన్నప్పటి నుంచి చదువులో తెలివైనవాడు. బాంబే యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్‌లో పట్టభద్రుడయ్యాక, తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లాడు. అక్కడి నుంచి నావల్ టాటా అకౌంటింగ్ చదివి తిరిగొచ్చారు. 1930లో నావల్ టాటా 26 యేళ్ల వయసులో టాటా సన్స్ గ్రూప్‌లో చేరాడు. తొలి నాళ్లలో క్లర్క్-కమ్-అసిస్టెంట్ సెక్రటరీ ఉద్యోగిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత వేగంగా టాటా సన్స్‌కి అసిస్టెంట్ సెక్రటరీ స్థాయికి చేరుకున్నాడు. 1933లో నావల్ టాటా ఏవియేషన్ డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీగా, టెక్స్‌టైల్ యూనిట్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. ఆ తర్వాత 1939లో నావల్ టాటాకు టాటా మిల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు దక్కాయి. 2 సంవత్సరాల తర్వాత 1941లో టాటా సన్స్‌కి డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నావల్ టాటా 1961లో టాటా ఎలక్ట్రిక్ కంపెనీకి ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. కేవలం ఏడాది తర్వాత అతను టాటా సన్స్ ప్రధాన గ్రూప్‌కు డిప్యూటీ ఛైర్మన్‌గా నియమించబడ్డాడు.
1965లో నావల్ టాటా సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసేవారు. నావల్ టాటా తన గతాన్ని గుర్తుచేసుకుంటూ.. ‘పేదరికం బాధను అనుభవించే అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు నేను ఆయనకు కృతజ్ఞుడను. ఇది నా జీవితంలోని తర్వాతి సంవత్సరాల్లో అన్నింటికంటే ఎక్కువగా నా పాత్రను తీర్చిదిద్దింది’ అంటూ గతాన్ని గుర్తు చేసుకునే వారు. నావల్ టాటాకు రెండుసార్లు వివాహం జరిగింది. మొదటి భార్య సన్నీ కమిసరియట్ ద్వారా రతన్ టాటాకు జన్మనిచ్చారు. నావల్ టాటా 1940లో మొదటి భార్య సుని కమిషనరేట్‌కు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత 1955లో స్విస్ వ్యాపారవేత్త సిమోన్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి నియోల్ టాటా జన్మించారు. నావల్ టాటా క్యాన్సర్‌తో బాధపడుతూ 5 మే 1989న ముంబై (బాంబే)లో మరణించారు.