Post Office Schemes: పోస్టాఫీసు పథకాలతో రాబడి గ్యారెంటీ.. ఆ పథకంలో ఏకంగా 8.2 శాతం వడ్డీ
భారతదేశంలో చాలా ఏళ్లుగా పోస్టాఫీసు పథకాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలను పొదుపు మార్గం వైపు తీసుకెళ్లడానికి ఈ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. నెలవారీ చందాలతో నడిచే ఈ పథకాలు గరిష్ట రాబడిని అందిస్తున్నాయి. పౌరుల వయస్సు ఆధారంగా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోస్టాఫీసు పథకాల్లో ఏయే పథకంలో ఎంత వడ్డీ వస్తుందో? తెలుసుకుందాం.

పోస్టాఫీస్ సాధారణ, సీనియర్ సిటిజన్లందరికీ అనేక పొదుపు పథకాలను అందిస్తుంది. సురక్షితమైన పెట్టుబడి ఎంపికలతో పాటు హామీ ఇచ్చే రాబడి కోసం చూస్తున్న పెట్టుబడిదారులు పోస్టాఫీస్ పథకాలను ఎంచుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర (కేవీపీ), సుకన్య సమృద్ధి ఖాతా (ఎస్ఎస్ఏ), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి పథకాలు ప్రత్యేక రాబడిని అందిస్తున్నాయి. ఈ పథకాలకు వేర్వేరు పెట్టుబడి ప్రమాణాలు ఉన్నాయి. కనీస పెట్టుబడి అవసరం, వయస్సు, వ్యవధి వంటి పథకానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి.
మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్
పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది మీరు ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన పొదుపు పథకం. ఈ పథకంలో సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. మీరు కేవలం రూ. 100తో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఖాతాను తెరవచ్చు. ఒక ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షలు, ఉమ్మడి ఖాతాలో రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర
కిసాన్ వికాస్ పత్ర సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1,000గా ఉంది. అలాగే ఈ స్కీమ్‌కు గరిష్ట పరిమితి లేదు.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన అనేది బాలికల ప్రత్యేక పథకం. ఈ పథకం కింద, ఒక బాలిక తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు సంవత్సరానికి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ పథకంలో కూడా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు. ఈ ఖాతాలో కూడా ఒకే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఖాతాలో డిపాజిట్ చేయడానికి గరిష్ట పరిమితి రూ. 30 లక్షలు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్‌సీ) వార్షికంగా చక్రవడ్డీతో కలిపి 7.7 శాతం వడ్డీని అందిస్తుంది. అయితే ఈ స్కీమ్‌లో కనీసం రూ. 1,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అయితే పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు.
రికరింగ్ డిపాజిట్
పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కింద మీరు సంవత్సరానికి 6.7 శాతం వడ్డీని పొందవచ్చు. కనీసం రూ. 100 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ స్కీమ్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)
ఈ పథకంలో ఓ ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ. 500 నుంచి రూ. 1.5 లక్షల వరకు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో సంవత్సరానికి 7.1 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. అలాగే పీపీఎఫ్‌పై సంపాదించే వడ్డీకి పన్ను ఉండదు. అయితే ఈ స్కీమ్ లాక్-ఇన్ వ్యవధి 15 సంవత్సరాలుగా ఉంది.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా
పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా వ్యక్తిగత/ఉమ్మడి ఖాతాలపై సంవత్సరానికి 4 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ ఖాతాను ప్రారంభించడానికి అవసరమైన కనీస మొత్తం రూ. 500గా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..