Post Office Scheme: పోస్టల్ శాఖలో వివిధ రకాల స్కీమ్‌లను ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇతర సంస్థల్లో ఉన్నట్లుగానే పోస్టాఫీసుల్లో కూడా అన్ని రకాల స్కీమ్‌లను అందిస్తోంది. భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకునేందుకు అనేక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో అత్యంత సురక్షితమైనవి పోస్టాఫీసులు అందించే పెట్టుబడి పథకాలు. ఈ స్కీమ్‌ల ద్వారా మంచి రాబడి అందుకోవచ్చు. పోస్టాఫీసు ప్రవేశపెట్టిన స్కీమ్‌లలో గ్రామ సుమంగళ్ గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిని 1995లోనే ప్రవేశపెట్టారు. ఇందులో వేర్వేరు వ్యవధులు, వివిధ పెట్టుబడి మొత్తంతో కూడిన ఆరు బీమా ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. వీటిలో రోజూ రూ.95 పెట్టుబడితో 20 ఏళ్లలో రూ.14 లక్షలు సొంతం చేసుకోవచ్చు.
ఈ పథకంలో రెండు ఆప్షన్లు ఉన్నాయి. అంటే 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలపరిమితితో అందుబాటులో ఉంది. 19-45 సంవత్సరాల వయసు ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.15 ఏళ్ల పాటు పాలసీలో మనీ బ్యాక్ ఆప్షన్ ఉంది. పాలసీ తీసుకున్న తర్వాత 6 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం మొత్తాన్ని.. అలాగే 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 20 శాతం మొత్తాన్ని పాలసీదారుడు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా పెట్టుబడిదారులకు అందిస్తారు. అదే 20 సంవత్సరాల పాలసీ అయితే 20 శాతం చొప్పున 8వ సంవత్సరంలో, 12వ సంవత్సరంలో, 16వ సంవత్సరంలో చెల్లిస్తారు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని మెచురిటీపై బోనస్‌గా అందిస్తారు.
25 సంవత్సరాల వ్యక్తి రూ.7 లక్షల ఇన్సూరెన్స్ హామీ కోసం 20 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారనుకుంటే.. వారు ప్రతి నెల రూ.2853 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇది రోజుకు సుమారు రూ.95గా ఉంటుంది. ఈ స్కీమ్ కింద 8వ సంవత్సరం, 12వ సంవత్సరం, 16వ సంవత్సరం పెట్టుబడిదారులకు 20 శాతం చొప్పున.. అంటే రూ.1.4 లక్షల చొప్పున తిరిగి చెల్లిస్తారు. చివరగా 20వ సంవత్సరంలో రూ.2.8 లక్షలు హామీపూరిత మొత్తంగా అందుతాయి.
ఈ స్కీమ్ కింద పెట్టుబడి పెట్టిన ప్రతి రూ.1000కి రూ.48 బోనస్‌గా చెల్లిస్తారు. అంటే రూ.7 లక్షలకు ప్రతి సంవత్సరం బోనస్ రూపంలో రూ.33,600 అందుతుంది. మొత్తం 20 సంవత్సరాలకు ఈ బోనస్ రూ.6.72 లక్షలు అవుతుంది. అంటే రూ.7 లక్షల హామీపూరిత మొత్తం, ఈ బోనస్ రూ.6.72 లక్షలు కలిస్తే 20 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులు రూ.13.71 లక్షలు అందుకుంటారు. ఇందులో రూ.4.2 లక్షలు మనీ బ్యాక్‌గా ముందే పొందుతారు. చివరిలో బోనస్, మిగిలిన మొత్తం రూ.9.52 లక్షలు అందుకుంటారు. ఒకవేళ మెచూరిటీకి ముందే పెట్టుబడిదారులు మరణిస్తే.. హామీపూరిత మొత్తంతో పాటు బోనస్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.