Post Office Scheme: పెట్టుబడికి బెస్ట్ స్కీమ్ ఇదే.. ప్రతి నెలా రూ. రూ.9,250 రిస్క్ లేని ఆదాయం..
పెట్టుబడి పెట్టాలనుకునేవారికి, ముఖ్యంగా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునేవారికి శుభవార్త! పోస్టాఫీసు అందిస్తున్న మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (MIS) ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుంది. ఇది కేవలం మీ డబ్బుకు భద్రతను ఇవ్వడమే కాకుండా, ప్రతినెల మీకు స్థిరమైన మొత్తాన్ని అందజేస్తుంది. పదవీ విరమణ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం కచ్చితమైన ఆదాయం కావాలనుకునే సీనియర్ సిటిజన్లకు ఈ పథకం మరింత ప్రయోజనకరం.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఐదేళ్ల మెచ్యూరిటీ కాలంతో వస్తుంది. ఈ పథకంలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. ప్రతినెలా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు. మీరు ఐదేళ్లపాటు ఒకేసారి పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ అయ్యే వరకు ప్రతినెలా ఆదాయాన్ని పొందవచ్చు.
ఎవరు అర్హులు?
ఈ ఖాతాను ఎవరైనా వ్యక్తిగతంగా తెరవవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి కూడా ఉమ్మడి ఖాతా (జాయింట్ అకౌంట్) తెరవవచ్చు. పదేళ్లు నిండిన పిల్లల పేరుపై వారి సంరక్షకులు (గార్డియన్) ఖాతాను తెరవవచ్చు.
ఎంత పెట్టుబడి పెట్టాలి?
కనీసం రూ. 1,000 తో ఈ పథకంలో చేరవచ్చు. వ్యక్తిగత ఖాతాలో గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు, ఉమ్మడి ఖాతాలో అయితే రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంది.
ఆకర్షణీయమైన వడ్డీ రేటు, పన్నులు
ప్రస్తుతం ఈ పథకంపై 7.4 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. మీ పెట్టుబడి మొత్తాన్ని బట్టి ప్రతినెలా మీ ఖాతాలోకి వడ్డీ జమ అవుతుంది. అయితే, ఈ పథకం కింద లభించే వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
మెచ్యూరిటీ, ముందస్తు ఉపసంహరణ
MIS ఖాతా ఐదేళ్లకు మెచ్యూర్ అవుతుంది. మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత, మీరు కావాలనుకుంటే పెట్టుబడిని మరో ఐదు సంవత్సరాలు పొడిగించుకోవచ్చు.
అనుకోని పరిస్థితుల్లో ఖాతాదారులు పథకాన్ని మధ్యలోనే మూసివేయాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి:
ఒక సంవత్సరం తర్వాత: పెట్టుబడి పెట్టిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.
1 నుండి 3 సంవత్సరాల మధ్య: ఈ కాలంలో డబ్బును వెనక్కి తీసుకుంటే, డిపాజిట్ చేసిన మొత్తం నుంచి 2 శాతం తీసేసి మిగిలిన డబ్బు తిరిగి ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత: ఖాతా తెరిచిన మూడేళ్ల తర్వాత క్లోజ్ చేయాలనుకుంటే, ఒక శాతం నగదును తీసివేసి మిగతాది ఇస్తారు.
మీ పెట్టుబడికి ఎంత వస్తుంది?
ఉదాహరణకు: మీరు ఉమ్మడి ఖాతా తెరిచి గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం ప్రతి నెలా మీ ఖాతాలో రూ.9,250 జమ అవుతుంది. అదే సింగిల్ ఖాతా తెరిచి గరిష్ఠంగా రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, మీకు ప్రతి నెలా రూ.5,550 వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఖాతా తెరవడానికి కావాల్సిన పత్రాల గురించి మీ సమీప పోస్టాఫీసులో తెలుసుకోవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా, స్థిరమైన ఆదాయం కోసం ఈ పథకాన్ని పరిశీలించవచ్చు.




