Post Office: ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ. 9250 ఆదాయం.. పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్..
మధ్యతరగతి ప్రజలకు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న బంపర్ ఆఫర్ ఇది. కేవలం ఒక్కసారి డబ్బు డిపాజిట్ చేస్తే, ఐదేళ్ల పాటు మీ జేబులోకి ప్రతి నెలా నగదు వచ్చి చేరుతుంది. అదీ కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో.. అసలు ఈ పథకంలో రూ. 15 లక్షలు పెడితే నెలకు ఎంత వస్తుంది? రూ. 9 లక్షలకు వచ్చే లాభం ఎంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బును సురక్షితంగా దాచుకోవడంతో పాటు ప్రతి నెలా ఇంటి ఖర్చుల కోసం కొంత ఆదాయం రావాలని కోరుకుంటున్నారా..? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ ఒక వరం లాంటిది. ఈ త్రైమాసికానికి కూడా కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అంటే పాత ఆకర్షణీయమైన వడ్డీ రేట్లే కొనసాగుతున్నాయి.
ఏమిటీ ఈ పథకం?
ఇది ఒక ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిదే కానీ వడ్డీని చివర్లో కాకుండా ప్రతి నెలా మీ చేతికి అందిస్తుంది. ఈ పథకం కాలపరిమితి 5 ఏళ్లు. మీరు డిపాజిట్ చేసిన అసలు మొత్తం 5 ఏళ్ల తర్వాత మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఈ లోపు ప్రతి నెలా వడ్డీ రూపంలో మీకు ఆదాయం లభిస్తుంది.
వడ్డీ రేటు – పెట్టుబడి పరిమితులు
ప్రస్తుతం ఈ పథకంపై కేంద్ర ప్రభుత్వం 7.4 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. జాయింట్ అకౌంట్ అయితే భార్యాభర్తలు కలిసి గరిష్టంగా రూ. 15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. కేవలం రూ. 1000 తో కూడా ఈ ఖాతా ప్రారంభించవచ్చు.
నెలకు ఎంత వస్తుంది?
మీరు జాయింట్ అకౌంట్‌లో 15లక్షల పెట్టుబడి పెట్టారని అనుకుంటే.. దానిపై నెలకు వడ్డీ రూ.9250 వస్తుంది. ఒకవేళ సింగిల్ అకౌంట్ అయితే గరిష్ఠంగా 9లక్షల పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5550 రూపాయల ఆదాయం వస్తుంది.
ఎవరికి ఇది బెస్ట్ ఆప్షన్?
రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బును ఇందులో దాచుకుని నెలవారీ ఖర్చులకు వాడుకోవచ్చు. ఇంటి అద్దె, పిల్లల ఫీజులు లేదా కిరాణా ఖర్చుల కోసం ఈ ఆదాయం ఉపయోగపడుతుంది. షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీతో మీ డబ్బు 100శాతం సురక్షితంగా ఉంటుంది.
ఖాతా తెరవడం ఎలా?
మీకు సమీపంలోని పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి ఈ ఖాతా తెరవవచ్చు. దీని కోసం మీకు పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలి. ఎందుకంటే ప్రతి నెలా వచ్చే వడ్డీ నేరుగా మీ సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది.
