EPFO: పీఎఫ్‌పై కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్.. వేతన పరిమితి భారీగా పెంపు.. 12 ఏళ్ల తర్వాత తొలిసారి..
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ వేతన పరిమితి పెంపుకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు రూ.15 వేలుగా ఉండగా.. ఇప్పుడు రూ.25 వేలకు పెంచింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిని ఆమోదముద్ర వేశారు. దీంతో త్వరలో అందుబాటులోకి రానుంది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ శాలరీ లిమిట్‌ను రూ.15 వేల నుంచి రూ.25 వేల వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేయగా.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో 51 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ స్కీమ్ అమలు కోసం రూ.11,339 కోట్లు కేటాయించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం పీఎఫ్ వేతన పరిమితి రూ.15 వేలు మాత్రమే ఉంది. దీంతో రూ.15 వేలు జీతం తీసుకునే పీఎఫ్ పరిధిలో చేరడం తప్పనిసరి కాగా.. ఆపైన జీతం పొందేవారు పీఎఫ్ పరిధిలో చేరడం స్వచ్చంధం కాదు. రూ.15 వేలుపైబడి జీతం తీసుకునేవారు యాజమాన్యంతో ఒప్పందం మేరకు పీఎఫ్ పరిధిలో చేరాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల చాలామంది ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. దీంతో పీఎఫ్ శాలరీ లిమిట్‌ను పెంచాలనే డిమాండ్లు ఉద్యోగ సంఘాల నుంచి ఎప్పటినుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుత అన్ని నగరాల్లో జీతాలు పెరగడంతో.. పీఎఫ్ శాలరీ లిమిట్ కూడా పెంచాలని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో కేంద్రం త్వరలోనే పెంచనుందనే వార్తలు ఎప్పటినుంచో వినిపిస్తుండగా.. ఇప్పుడు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.
శాలరీ లిమిట్ పెంచడంతో అదనంగా 51 లక్షల మంది ఉద్యోగులకు పీఎఫ్ ప్రయోజనాలు లభించనున్నాయి. దీంతో దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పెద్ద శుభవార్తగా చెప్పవచ్చు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీఎఫ్ వేతన పరిమితిని పెంచాలన్న కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించారు. అనంతరం దీనికి ఆమోదముద్ర వేశారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని నగరాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగాయి. చివరిసారిగా 2014లో వేతన పరిమితి పెంచారు. అప్పటివరకు రూ.6500గా ఉండగా.. 2014లో రూ.15 వేలకు పెంచారు. ఆ తర్వాత 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. దీంతో కార్మిక సంఘాల కల నెరవేరినట్లయింది.
రూ.25 వేలకు పెంచడం వల్ల ఏం జరుగుతుంది..?
ప్రస్తుతం వేతన పరిమితి రూ.15 వేలుగా ఉండటం వల్ల బేసిక్ శాలరీలో 12 శాతం చొప్పున ప్రతీ నెలా ఉద్యోగి జీతంలో కట్ చేస్తున్నారు. అంటే గరిష్టంగా రూ.1800 కట్ అవుతున్నాయి. ఇప్పుడు రూ.25 వేలకు పెంచడం వల్ల ప్రతీ నెలా రూ.3 వేల వరకు పీఎఫ్ చందా చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల నెలవారీ చందా పెరగుతుంది. కంపెనీలు కూడా తమ చందాను ఎక్కువ చెల్లించాల్సి రావడం వల్ల వారిపై ఆర్ధిక భారం పడుతుంది.
