Bullet Trains: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ట్రయల్ రన్స్‌కు అంతా రెడీ.. ముహూర్తం ఎప్పుడంటే..?
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. అందులో భాగంగా తొలి ట్రైన్ ట్రయల్ రన్స్‌పై కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై ట్రయల్ రన్స్ మొదలుకానున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పనులు పూర్తి కావొచ్చాయి.

దేశంలో రైల్వే వ్యవస్థలో నూతన మార్పులు రానున్నాయి. రైల్వే నెట్‌వర్క్ స్వరూపమే రానున్న కొన్నేళ్లల్లో పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు విదేశాల్లో బుల్లెట్ రైళ్లను మనం చూస్తుండగా.. దేశంలో కూడా బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఈ మేరకు దేశంలో ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లను నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచించింది. వీటిల్లో తొలి ప్రాజెక్టు అయిన ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ కారిడార్‌లోనే దేశంలోనే తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభించేందుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ట్రయల్ రన్స్‌పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
2027 మే లేదా జూన్‌లో ముంబై-అహ్మదాబాద్‌లో తొలి బుల్లెట్ రైలుకు ట్రయల్ రన్ నిర్వహించే దిశగా రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. బుల్లెట్ రైలు ప్రారంభించే ప్రయత్నంలో ట్రయల్ రన్స్ ఒక కీలక ముందడుగు చెప్పవచ్చు. ఇప్పటికే బుల్లెట్ రైలు బాడీ ఫ్రేమ్ పూర్తి కాగా.. స్క్వీజ్ టెస్టింగ్ కోసం పంపారు. ఈ టెస్టులో భాగంగా కోచ్‌ల బలాన్ని పరిశీలించనున్నారు. ట్రయల్ రన్ ప్రారంభించే ముందు స్క్వీజ్ టెస్ట్ అనేది ముఖ్యమైన ప్రక్రియగా చెప్పవచ్చు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు విడతల వారీగా చేపడుతున్నారు. ఈ మార్గంలోని సూరత్-వాపి మధ్య పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. డిసెంబర్ నాటికి మిగతా పనులు కూడా పూర్తి కానుండగా.. అనంతరం బుల్లెట్ ట్రైన్ ప్రారంభించేందుకు మార్గం సుగమం కానుంది. వచ్చే ఏడాది ఆగస్ట్ 15వ తేదీన సూరత్-వాపి మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రారంభించనున్నారు. ఈ రైలుతో నగరాల మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే వడోదర నుంచి ముంబైకు గంటన్నరలో చేరుకోవచ్చు.
ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత రెండు నుంచి నాలుగు నెలల పాటు టెస్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల దశ ముగిసిన తర్వాత ప్రయాణికుల కోసం బుల్లెట్ ట్రైన్ ప్రవేశపెడతారు. ట్రయల్స్ దశ పూర్తయ్యాక ప్రారంభోత్సవం ఉంటుందని తెలుస్తోంది. ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమరా విభాగాన్ని తొలుత కార్యరూపంలోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత విడతల వారీగా ఇతర ప్రాంతాల మధ్య కూడా సేవలు ప్రారంభించనున్నారు. వాపి-అహ్మదాబాద్, అహ్మదాబాద్-థానే మార్గం దశలవారీగా ప్రారంభిస్తారు. దేశంలో మొత్తం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ-వారణాసి, వారణాసి-పాట్నా-సిలిగురి, ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, బెంగళూరు-చెన్నై, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలు ఉన్నాయి. మిగతా కారిడార్లను పట్టాలెక్కించడంపై కూడా వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
