
గతం గతః అంటారు పెద్దలు. నిజమే పాత కాలాన్ని మరచిపోవాలి.. కానీ అది నేర్పిన పాఠాలు మాత్రం మరిచిపోకూడదు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో నూతన ఆశలు మొగ్గతొడగుతాయి. కొత్త ఉత్సాహం మనలో ఉంటుంది. కొన్ని లక్ష్యాలను కూడా వ్యక్తిగతంగానూ, కుటుంబ పరంగా మనం పెట్టుకుంటాం. అయితే వాటిని ఫుల్ ఫిల్ చేసుకోవాలంటే మాత్రం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అవసరం. ఎందుకంటే ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకు ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరం. పొదుపు మంత్రాన్ని అందరూ తప్పక పాటించాల్సిందే. సంపాదనను తెలివిగా వినియోగించుకుంటూ కొంతమొత్తాన్ని పొదుపు చేసుకుంటే, సురక్షిత పథకాలలో పెట్టుబడులు పెట్టుకొని లాభాలు రాబట్టుకోగలగితే బావుంటుంది. మీరు కూడా ఇలాంటి ఆలోచనలతోనే ఉంటే ఈ కథనం మీ కోసమే. ఈ కొత్త సంవత్సరంలో సులభమైన పొదుపు మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం..
సాధారణంగా ఫైనాన్స్ రంగానికి చెందిన వారికి 50/30/20 బడ్జెట్ నియమం తెలిసే ఉంటుంది. దీనినే ప్రాథమిక పొదుపు వ్యూహంగా ఆర్థిక నిపుణులు అభివర్ణిస్తారు. ఇది ఒక నెలలో మీ చేతికి వచ్చే సంపాదనను ఎలా ఖర్చు చేయాలి అనేది తెలియజేస్తుంది. మీ ఇన్‌హ్యాండ్ ఆదాయంలో 50శాతం కుటుంబ అవసరాలకు, 30 శాతం మీ కోరుకున్న వాటికి, మరో 20 శాతం పొదుపు కోసం మళ్లించాలి. ఈ సరళమైన నియమం మీ ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవడమే సాయపడుతుంది.
2022ను ఒకసారి రివైండ్ చేద్దాం.. ఈ సంవత్సరంలో అధిక ద్రవ్యోల్బణం, యుద్ధాలు, మాంద్యం భయాలు వెంటాడాయి. దీంతో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్న ఆందోళన చెందల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 12 నెలలు ఎటువంటి పరిస్థితి ఎదురైనా పెట్టుబడి దారులు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేలా లక్ష్యాలను సమర్థంగా నిర్ధారించుకోవాలి. నిర్దిష్ట కాల వ్యవధిలో సాధించగలిగే వాస్తవిక లక్ష్యాలను అంచనా వేయాలి.
బడ్జెట్ ప్లాన్ అవసరం: మీ సంపాదనను ఖర్చు చేయడానికి ముందు 30% ఆదా చేసే సాధారణ సమీకరణాన్ని జ్ఞప్తకి తెచ్చుకోండి. ఇది అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి సాయపడుతుంది. ఖర్చులు, పొదుపు.. అవసరాలు & కోరికల కోసం వేర్వేరు బ్యాంక్ ఖాతాలను కూడా ఏర్పాటు చేసుకోవడం మేలు.
మీ పన్నులపై క్లారిటీ: ఈ ఏడాదిలో కట్టవలసిన పన్నుల వివరాలను ముందుగానే తెలుసుకుని దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోవాలి. మార్చిలో కదా కట్టేది.. ఇప్పటి నుంచే ఎందుకు ప్లానింగ్ అనుకోకూడదు.
బీమా ఉంటే ధీమా: కోవిడ్ మహమ్మారి మానవ జీవితాలకు సరికొత్త పాఠాలు నేర్పింది. ఆరోగ్య భద్రత కొరవడిన ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి.
తెలివిగా పెట్టుబడి పెట్టాలి: మీకున్న సేవింగ్స్ ను అలా ఉంచే కన్నా ఏదైనా సులభ, సురక్షిత పెట్టుబడి పథకాల్లో పెట్టుబడి పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దిశగా ఆలోచిస్తే ఫిక్స్ డ్ డిపాజిట్(ఎఫ్డీ), రియల్ ఎస్టేట్ లలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. ఈ రెండు ఒక రంగంతో మరొకటి సంబంధం లేనిది కాబట్టి అధిక రాబడులు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే పీపీఎఫ్, ఎన్పీఎస్ వంటి పథకాలు కూడా పదవీ విరమణ సమయానికి మీకు అధిక ప్రయోజనాన్ని చేకూరుస్తాయి.
నిర్ణయం ప్రధానం.. మీ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే దానిపై ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీకు అందుబాటులో ఉన్న విభిన్న ఎంపికలను జాగ్రత్తగా పరిశోధించి, సరిపోల్చడం ముఖ్యం. మీ దీర్ఘకాలిక లక్ష్యాలు, రిస్క్ టాలరెన్స్, విభిన్న పెట్టుబడి ఎంపికల సంభావ్య పన్ను ప్రభావాలను పరిగణించాలి.
సేవింగ్స్ నుంచి కొంత మొత్తాన్ని సురక్షితమైన కొన్ని పెట్టుబడి పథకాలలో ఇన్‌వెస్ట్ చేయడం ద్వారా భారీ రాబడులను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఈక్విటీ ఫండ్స్ మంచి ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌పై ఆధారపడే ఈ పథకంలో కాస్త రిస్క్ ఉన్నా.. పెద్దగా ప్రభావం చూపదు. 5సంవత్సరాల కాలపరిమితితో దీనిలో పెట్టుబడులు పెట్టొచ్చు. పెట్టుబడి పెట్టాలనుకునే వారు HDFC ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్, SBI ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మంచి ఆప్షన్లు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..