
బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతుండటం, హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది భయపడుతున్నారు. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాకపోవడంతో వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టమోస్తుందనే ఆందోళనతో వెనక్కి తగ్గుతున్నారు. ఇక కొంతమంది భవిష్యత్తులో పెరుగుతుందనే ఆశతో తగ్గినప్పుడు కొనుగోలు చేసి పెరిగినప్పుడు సేల్ చేసి లాభాలు పెడుతున్నారు. అయితే పసిడి ధరలు పెరుగుతుండటంతో మరికొంతమంది ప్రత్యామ్నాయ మెటల్స్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా రాగిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో గత ఏడాదిగా కాపర్ ధరలు ఆమాంతం పెరుగుతూ వస్తోన్నాయి. 2025లో కాపర్ ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమెడిటీ ఎక్సేంజ్(MCX)లో ఏకంగా 50 శాతం నుంచి 63 శాతం వరకు పెరిగాయి.
2016 ప్రారంభంలో కిలో రాగి రూ.316గా ఉండగా.. జనవరి 1,2026 నాటికి కిలో రూ.1292.50కి పెరిగింది. లండన్ మెటల్ ఎక్సేంజ్‌తో పాటు ప్రపంచ మార్కెట్లలో ఈ ఎర్ర లోహం ధర 35 నుంచి 40 శాతం పెరిగి టన్నుకు 12 వేల డాలర్లకుపైగా పెరిగి రికార్డ్ నమోదు చేసింది. రాగి ఈటీఎఫ్, కంపెనీలలో పెట్టుబడులు పెరగడంతో పాటు గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లు, డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఇతర తయారీ రంగాల్లో కాపర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండటంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. దీంతో రాగిలో పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.
గోల్డ్, వెండి ఈటీఎఫ్(ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్)లు తరహాలోనే అమెరికా, యూరోపియన్ దేశాల్లో కాపర్ ఈటీఎఫ్‌లు ఉన్నాయి. కానీ భారత్‌లో ఇలాంటి ఈటీఎఫ్ ఫండ్స్ ఇంకా మొదలుకాలేదు. దీంతో భారతీయులు కాపర్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఎంసీఎక్స్ కమోడిటీ ఫ్యూచర్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక ఇంటర్నేషనల్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టవవచ్చు. ఇక కాపర్ మైనింగ్, మ్యాన్యూఫాక్చరింగ్ కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు. హిందూస్థాన్ కాపర్, వేదాంత హిందాల్కో లాంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కమోడిటీస్ ఫండ్, డీఎస్పీ నేచురల్ రిసోర్సెస్, న్యూ ఎనర్జీ ఫండ్ లాంటి మైనింగ్ లేదా తయారీలో పాల్గొన్న కంపెనీలను కలిగి ఉన్న ఫండ్లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. బంగారం, వెండిని బార్లు లేదా కాయిన్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. కానీ రాగిని అలా కొనుగోలు చేయడానికి కుదరదు. దీంతో భారత్‌లో కూడా కాపర్ ఈటీఎఫ్‌లను తీసుకురావాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీని వల్ల కాపర్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రాగికి డిమాండ్ పెరుగుతుండటంతో.. భారత్‌లో కూడా దానికి ఇక ఇన్వెస్ట్‌మెంట్ సాధనంగా మారిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.